Reading Time: 2 minutes

‘మిడ్ మానేరు’కు జలకళ..ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోతలు

Caption of Image.
  • 9,450 క్యూసెక్కులు మధ్య మానేరుకు.. 
  • ఎల్ఎండీకి 18 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో
  • సమ్మక్క సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద

కరీంనగర్, వెలుగు: రాష్ట్రంలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరి పరిధిలోని రిజర్వాయర్లు జలకళ సంతరించుకుంటున్నాయి. ఇప్పటికే పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో 20 టీఎంసీల పూర్తి స్థాయి నీటి నిల్వ ఉండగా.. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు డ్యామ్ లోకి 27.50 టీఎంసీలకుగాను 24.50 టీఎంసీల నీరు చేరింది. కరీంనగర్ జిల్లా లోయర్ మానేరు డ్యామ్ లో 24 టీఎంసీలకుగాను 12 టీఎంసీల నీరు ఉంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో సమ్మక్క సాగర్ ప్రాజెక్టు (తుపాకులగూడెం బ్యారేజీ)లోకి భారీగా వరద నీరు చేరుతోంది. బ్యారేజీ నీటిమట్టం 76.6 అడుగులకు చేరింది. 

ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు.. 

ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 20,692 క్యూసెక్కుల వరద వస్తుండడంతో 12,998 క్యూసెక్కుల నీటిని బయటికి వదులుతున్నారు. అలాగే ఈ ప్రాజెక్ట్ నుంచి మూడు మోటార్లు ఆన్ చేసి 9,450 క్యూసెక్కుల నీటిని ధర్మారం మండలంలోని నంది మేడారం పంప్ హౌస్ కు, అంతేనీటిని కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్ కు లిఫ్ట్ చేస్తున్నారు. గాయత్రి పంప్ హౌస్ నుంచి మూడు మోటార్లు ఆన్ చేసి మిడ్ మానేరు కు గ్రావిటీ కెనాల్ ద్వారా 9,450 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఈ నీరు మిడ్ మానేరు ప్రాజెక్టులోకి చేరుతోంది. మూలవాగు, మానేరు నుంచి మరో 2,300 క్యూసెక్కులు కలిపి 11,750 క్యూసెక్కుల వరద మిడ్ మానేరులోకి వస్తోంది. మరో 3 టీఎంసీల నీరు చేరితే మిడ్ మానేరు పూర్తిస్థాయి నీటిమట్టానికి వచ్చే అవకాశముండగా.. ఇన్ ఫ్లోకు అనుగుణంగా 18వేల క్యూసెక్కులులోయర్ మానేరు డ్యామ్ లోకి వదులుతున్నారు. ఎల్లంపల్లి ఎగువన కడెం కూడా పూర్తిస్థాయిలో నిండింది. 3.5 టీఎంసీల నిల్వ కొనసాగిస్తూ 746 క్యూసెక్కులు దిగువకు విడిచిపెడ్తున్నారు.

సగం నిండిన లోయర్ మానేరు డ్యామ్

మిడ్ మానేరు డ్యామ్ నుంచి లోయర్ మానేరు డ్యామ్ కు 8 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. అలాగే మోయతుమ్మెద వాగు నుంచి 1615 క్యూసెక్కులు, ఎస్సారెస్పీ నుంచి 571 క్యూసెక్కుల ఇన్ ఫ్లోతో కలిపి మొత్తం 10,186 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రస్తుతానికి 24 టీఎంసీలకుగాను 12 టీఎంసీల నీరు ఉండగా.. మరో 12 టీఎంసీల నీరు వస్తే పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకోనుంది.

సమ్మక్క సాగర్ ప్రాజెక్టులోకి భారీ వరద
ఎగువన కురుస్తున్న వర్షాలకు సమ్మక్క సాగర్ ప్రాజెక్టు (తుపాకులగూడెం బ్యారేజీ)లోకి వరద నీరు భారీగా చేరుతోంది. బ్యారేజీ గరిష్ట నీటిమట్టం 83 ఫీట్లు కాగా 76.6 ఫీట్లకు చేరింది. 1,30,600 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి చేరుతుండడంతో స్పిల్‌‌ వే గేట్ల ద్వారా 1,15,700 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. మానేరు, గోదావరిపై ఉన్న ప్రాజెక్టుల్లోకి వరద పెరగడం, ముఖ్యంగా ఎల్లంపల్లి నిండడంతో తాగునీటి గండం తప్పినట్లేనని ఇరిగేషన్​అధికారులు చెప్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.