
మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకోనున్నాయా? మళ్లీ బాంబు దాడులతో దద్దరిల్లనుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇరాన్ ప్రతిపాదించిన ఏడు రోజుల కాల్పుల విరమణకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించలేదని ది వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ నివేదికలో పేర్కొంది. అంతేకాదు.. నవంబర్ మధ్యంతర ఎన్నికల తర్వాత ఇరాన్‌పై అమెరికా మళ్లీ వైమానిక దాడులు చేపట్టే అవకాశం ఉందని ట్రంప్ తన సహాయకులతో చెప్పినట్లు అమెరికా అధికారులను ఉటంకిస్తూ నివేదిక వెల్లడించింది. అయితే ఈ విషయాన్ని అమెరికా అధికారికంగా ధ్రువీకరించలేదు.
ఇరాన్ ప్రతిపాదనలో కీలకంగా హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం, అణు కార్యక్రమంపై చర్చలను పునఃప్రారంభించడం ఉన్నాయి. అమెరికా తన నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేస్తే ఏడు రోజుల్లో హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవచ్చని టెహ్రాన్ ప్రతిపాదించింది. అలాగే ప్రాంతంలో కొనసాగుతున్న ఘర్షణలకు ముగింపు పలకాలని కోరింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా న్యూయార్క్‌లో ఖతార్ మధ్యవర్తిత్వంతో జరిగిన చర్చల ద్వారా ఈ ప్రతిపాదనను అమెరికాకు పంపినట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి తెలిపారు.
“అవసరమైన పరిస్థితులు ఏర్పడితే ఏడు రోజుల్లో జలసంధిని తెరిచి సాధారణ సముద్ర రాకపోకలను పునరుద్ధరించవచ్చు” అని అరాఘ్చి పేర్కొన్నారు. ఇప్పుడు నిర్ణయం అమెరికా చేతుల్లోనే ఉందని అన్నారు. ఇదిలా ఉండగా.. ఇరాన్‌తో పరోక్ష చర్చలు “సానుకూలంగా, నిర్మాణాత్మకంగా” కొనసాగుతున్నాయని ఓ అమెరికా అధికారి చెప్పినట్లు సమాచారం. అంటే ఇరాన్-అమెరికా మధ్య దౌత్యపరమైన సంప్రదింపులు కొనసాగుతున్నప్పటికీ.. కాల్పుల విరమణ ప్రతిపాదన విషయంలో ఇరు దేశాల మధ్య విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది.
దాడులకు సిద్ధమవుతున్నారా?
నివేదిక ప్రకారం.. ఇరాన్ తన అణు కార్యక్రమంపై అమెరికా పెట్టిన డిమాండ్లకు అంగీకరిస్తుందా అన్న విషయంలో ట్రంప్‌కు అనుమానాలు ఉన్నాయి. నవంబర్ మధ్యంతర ఎన్నికల తర్వాత ఇరాన్‌పై అమెరికా బాంబింగ్ మళ్లీ ప్రారంభమవుతుందని ఆయన తన సహాయకులతో చెప్పినట్లు నివేదిక పేర్కొంది. అయితే.. ఒకవేళ అమెరికా సైనిక చర్యకు దిగితే దాని స్థాయి ఎంత ఉంటుంది? ఎప్పుడు ప్రారంభమవుతుంది? అనే విషయాలపై స్పష్టత లేదని నివేదిక తెలిపింది.
ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో హార్ముజ్ జలసంధి ఒకటి. అందుకే ప్రస్తుత ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల్లో ఇది ప్రధాన అంశంగా మారింది. ఈ జలమార్గాన్ని తిరిగి తెరవడాన్ని అమెరికా సైనిక, ఆర్థిక ఒత్తిళ్ల సడలింపుతో ముడిపెడుతూ ఇరాన్ ప్రతిపాదన చేసింది. కథనం వెలువడిన తర్వాత కూడా ఇరాన్ అమెరికా నుంచి అధికారిక స్పందన కోసం ఎదురుచూస్తున్నట్లు రాయిటర్స్ తెలిపింది. అయితే ట్రంప్ ఇరాన్ ఏడు రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనను తిరస్కరించారన్న WSJ కథనాన్ని తాము స్వతంత్రంగా వెంటనే ధ్రువీకరించలేకపోయామని రాయిటర్స్ పేర్కొంది. మధ్యవర్తుల ద్వారా దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ.. చర్చలు ఏ క్రమంలో జరగాలి, ఆంక్షల పరిస్థితి ఏమిటి, హార్ముజ్ జలసంధిని ఎప్పుడు తెరవాలి, ఇరాన్ అణు కార్యక్రమంపై ఎలాంటి ఒప్పందం కుదరాలి అనే అంశాల్లో అమెరికా, ఇరాన్ మధ్య ఇంకా విభేదాలు కొనసాగుతున్నాయి.