
పాకిస్థాన్‌లో మరోసారి భారీ పేలుడు జరిగింది. వాయువ్య పాకిస్థాన్‌లోని డేరా ఇస్మాయిల్ ఖాన్‌లో శనివారం జరిగిన పేలుడులో కనీసం 11 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 30 మంది గాయపడినట్లు స్థానిక అత్యవసర సేవలు వెల్లడించాయి. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
అసోసియేటెడ్ ప్రెస్ (AP) తెలిపిన వివరాల ప్రకారం.. చెక్‌పోస్టు దగ్గర పేలుడు పదార్థాలతో నింపిన వాహనాన్ని ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తి పేల్చివేసినట్లు పోలీసులు, సహాయక సిబ్బంది తెలిపారు. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు.
ఈ దాడికి తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (TTP) బాధ్యత వహించినట్లు AP పేర్కొంది. TTP తన ప్రకటనలో ఈ పేలుడికి తామే బాధ్యులమని చెప్పినట్లు తెలిపింది. పేలుడు తర్వాత క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని ప్రావిన్షియల్ ఎమర్జెన్సీ సర్వీస్ ప్రతినిధి APకి తెలిపారు. పేలుడు జరిగిన ప్రాంతం నుంచి భారీగా బూడిద రంగు పొగ పైకి ఎగసిపడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.