Reading Time: < 1 minute
BIS: ఇకపై స్క్రీన్ గార్డులకు BIS తప్పనిసరి

స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల భద్రత, నాణ్యమైన ఉత్పత్తుల లభ్యత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో లభించే స్మార్ట్‌ఫోన్ గ్లాస్ స్క్రీన్ ప్రొటెక్టర్లకు (టెంపర్డ్ గ్లాస్) బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తూ కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 2021 నాటి కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆర్డర్‌ను సవరిస్తూ దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కొత్త నిబంధనల ప్రకారం స్క్రీన్ ప్రొటెక్టర్లు ఇకపై IS 19348:2025 అనే భారతీయ నాణ్యతా ప్రమాణాన్ని ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఈ ప్రమాణంలో గాజు మందం, బలం, పారదర్శకత, అంటుకునే సామర్థ్యం, యాంటీ-షాటర్ ఫిల్మ్, ఓలియోఫోబిక్ కోటింగ్ వంటి కీలక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ నిబంధనలు ఏప్రిల్ 1, 2027 నుంచి అమలులోకి రానున్నాయి. తయారీదారులు, దిగుమతిదారులు ఈ ప్రమాణాలకు అనుగుణంగా మారేందుకు తగిన సమయం కల్పించారు. ఆ తేదీ తర్వాత BIS మార్క్ లేని, నాణ్యతా ప్రమాణాలు లేని స్క్రీన్ గార్డ్‌లను తయారు చేయడం, దిగుమతి చేసుకోవడం, అమ్మడం పూర్తిగా చట్టవిరుద్ధం అవుతుంది. ప్రస్తుతం మార్కెట్‌లో లభిస్తున్న నాసిరకం ఉత్పత్తుల నుంచి డిస్‌ప్లేను, వినియోగదారులను రక్షించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం. భారతీయ సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ICEA) అంచనా ప్రకారం.. భారత్‌లో ఏటా 50 కోట్లకు పైగా స్క్రీన్ ప్రొటెక్టర్లు విక్రయమవుతున్నాయి. ఈ నిర్ణయంతో దేశంలో దాదాపు రూ. 12,000 నుండి రూ. 16,000 కోట్ల విలువైన నాణ్యమైన పరిశ్రమ ఏర్పడే అవకాశం ఉంది. దీని ద్వారా సుమారు 60,000 కొత్త ఉద్యోగాలు రావడమే కాకుండా, ప్రభుత్వానికి రూ. 2,000 కోట్ల జీఎస్‌టీ రాబడి లభిస్తుందని భావిస్తున్నారు. అంతేకాకుండా స్వదేశీ తయారీ రంగానికి ఇది ఊతమిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

PhonePe: ఫోన్‌పే భారీ విస్తరణ.. 20,000 ఉద్యోగాలు

Vijayawada: ఏపీలో భారీ వర్షాలు ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన వరద