
హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్ శాఖలో కొత్తగా రిక్రూటై ట్రైనింగ్‌లో ఉన్న 100 మంది అసిస్టెంట్ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల (ఏఈఈ) నాగార్జునసాగర్డ్యామ్ ఫీల్డ్ విజిట్కు కృష్ణా బోర్డు అనుమతినిచ్చింది. వారితో పాటు వాలంటరీ శిక్షణా సిబ్బంది పది మంది కూడా సాగర్‌కు వెళ్లనున్నారు. 2024లో రిక్రూట్అయిన బ్యాచ్ 1, బ్యాచ్ 2 ఏఈఈలకు శనివారం (ఈనెల 26న) సాగర్ ప్రాజెక్టుతో పాటు కెనాల్ నెట్‌వర్క్‌ను పరిశీలించేందుకుగానూ అనుమతివ్వాల్సిందిగా సీఆర్పీఎఫ్ బలగాలకు రెండు రోజుల కిందట కృష్ణా బోర్డు లేఖ రాసింది.
గతంలో నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర జలశక్తి శాఖ 2024 జనవరి 17న కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. డ్యామ్ సైట్ వద్ద సీఆర్పీఎఫ్ గస్తీని ఏర్పాటు చేశారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం.. తెలంగాణ, ఏపీ అధికారులు ఎవరైనా సాగర్ డ్యామ్ ప్రాంగణంలోకి వెళ్లాలంటే కేఆర్ఎంబీ ముందస్తు పర్మిషన్ తప్పనిసరి. ఈ నిబంధనల ప్రకారమే తెలంగాణ ప్రభుత్వం బోర్డు నుంచి ముందస్తు అనుమతి తీసుకుంది. ఆ రూల్స్అనుసరించి ఏఈఈల ఫీల్డ్ విజిట్కు కృష్ణా బోర్డు తాజాగా ఆమోదం తెలిపింది. డ్యామ్ సైట్ సందర్శన సందర్భంగా ఇంజినీర్లు, సిబ్బంది భద్రతకు సంబంధించి అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.