
- 2004 ఎన్నికల ముందు సొంత భూమి కూడా లేదు
- ఇప్పుడు 450 ఎకరాల భూములెలా వచ్చాయి?
- బీఆర్ఎస్ ఎలక్టోరల్ బాండ్లపై సీబీఐ ఎంక్వైరీ చేయాలి
- జైపూర్‌లో ఎస్సీ హాస్టల్ నిర్మాణానికి భూమిపూజ
కోల్‌బెల్ట్/జైపూర్, వెలుగు: తెలంగాణ ఉద్యమ సమయంలో ఆస్తులేమీలేవన్న కేసీఆర్ కు.. అధికారంలో ఉన్న పదేండ్లలో వేల కోట్లు ఎలా వచ్చాయని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రశ్నించారు. 2004 ఎన్నికల అఫిడవిట్లో తనకు ఒక్క ఎకరం భూమి కూడా లేదని కేసీఆర్ పేర్కొన్నారని.. మరి ఇప్పుడు రూ. వేల కోట్ల విలువైన 450 ఎకరాల భూములు ఎక్కడి నుంచి వచ్చాయో సమాధానం చెప్పాలన్నారు.
గురువారం మంచిర్యాల జిల్లా మందమర్రి, జైపూర్‌లో మంత్రి పర్యటించారు. ఊరుమందమర్రి, 23వ వార్డులో స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జైపూర్‌లో రూ.1.81 కోట్ల సీఎస్ఆర్ నిధులతో నిర్మించనున్న ఎస్సీ బాలుర హాస్టల్ భవనం పనులకు మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ భాస్కర్‌తో కలిసి భూమిపూజ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుందని, బలిదానాలతో వచ్చిన తెలంగాణలో ఫామ్ హౌస్ సంస్కృతి తీసుకొచ్చారని ధ్వజమెత్తారు.
తెలంగాణ ఉద్యమానికి ముందు కేసీఆర్ కుటుంబానికి ఎలాంటి ఆస్తులు, బిజినెస్‌లు, ఆమ్దానీ వచ్చే పనులు లేవన్నారు. సీఎంగా, మంత్రిగా తీసుకున్న జీతాలతో 450 ఎకరాల భూములు వచ్చాయా? అని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్‌లో కమీషన్లు, ఓఆర్ఆర్ ప్రాజెక్టు, ఎలక్టోరల్ బాండ్ల పేరుతో వేల కోట్ల ప్రజల సొమ్మును దొచుకున్నారని.. బ్లాక్ మొయిల్, కుంభకోణాలు చేసి సంపాదించారని విమర్శించారు. బీఆర్ఎస్ ఎలక్టోరల్ బాండ్లపై సీబీఐ ఎంక్వైయిరీ చేయాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ భూములపై జరుగుతున్న విచారణ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే బీఆర్ఎస్ లీడర్ల జైపూర్పవర్ ప్లాంట్ విజిట్పేర డ్రామా స్టార్ట్ చేశారన్నారు. గత ప్రభుత్వంలో సింగరేణి నిధులను సిద్దిపేట, సిరిసిల్లకు తరలించారని, స్థానిక నిధులను దోచుకెళ్లి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ధర్నాలు చేస్తున్నారని బాల్క సుమన్‌పై మంత్రి ఫైర్ అయ్యారు.
దేశవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం ఉందని, ఆ విషయం గమనించకుండా విద్యుత్ కొరతపై చిల్లర రాజకీయాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఆదిలాబాద్ రిమ్స్‌లో ప్రమాదం జరిగి చిన్నారులు మృతిచెందిన ఘటన చాలా బాధకరమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి చెప్పారు.