
ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మరి కొన్ని గంటల్లో బడా గణేశ్ శోభాయాత్ర.. ఆ తర్వాత నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. 2026 సెప్టెంబర్ 25న ఖైరతాబాద్ బడా గణేశ్ నిమజ్జన శోభాయాత్ర మొదలవుతుంది. ఉదయం 6 గంటలకు శోభాయాత్ర ప్రారంభం కానుంది.
ఖైరతాబాద్ గణేష్ మండపం నుంచి శోభాయాత్ర ప్రారంభం అవుతుంది. సెన్సేషన్ థియేటర్, రాజ్‌దూత్ చౌరస్తా, టెలిఫోన్ భవన్, ఇక్బాల్ మినార్, తెలంగాణ తల్లి చౌరస్తా మీదుగా
లుంబినీ పార్క్ పక్కన ఉన్న ఎన్టీఆర్ మార్గ్ మీదుగా గణేశ్ విగ్రహాన్ని తరలిస్తారు. అనంతరం హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేస్తారు.
మధ్యాహ్నం 12 గంటలలోపే నిమజ్జనం పూర్తి చేయాలని అధికారుల లక్ష్యంగా పెట్టుకున్నారు. 69 అడుగుల ఖైరతాబాద్ గణేశ్ కోసం ఎన్టీఆర్ మార్గ్ దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నిమజ్జనం కోసం లాంగ్ బూమ్ మెకానికల్ క్రేన్ నంబర్-4 ఏర్పాటు చేశారు.
నిమజ్జనం వేళ ట్రాఫిక్ ఆంక్షలు:
సెప్టెంబర్ 25 ఉదయం 6 గంటల నుంచి 26 ఉదయం 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ప్రధాన నిమజ్జన మార్గాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. విగ్రహాలను తరలించే వాహనాలకు మాత్రమే ప్రధాన ఊరేగింపు మార్గంలో అనుమతి ఉంటుంది.
ఖైరతాబాద్ ఫ్లైఓవర్, ఎన్టీఆర్ మార్గ్, పీవీఎన్‌ఆర్ మార్గ్/నెక్లెస్ రోడ్, ట్యాంక్‌బండ్ ప్రాంతాల్లో ఆంక్షలు ఉంటాయి. వాహనదారులు ఖైరతాబాద్, తెలుగుతల్లి, లిబర్టీ, MJ మార్కెట్, GPO వైపు వెళ్లకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.
నారాయణగూడ, RTC X రోడ్స్, ట్యాంక్‌బండ్, NTR మార్గ్, నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ట్రాఫిక్ రద్దీని బట్టి పోలీసులు ఆంక్షల్లో మార్పులు చేసే అవకాశం ఉంది. వాహనదారులు పోలీసుల సూచనలు పాటిస్తూ ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని సూచిస్తున్నారు.