Reading Time: 2 minutes

చరిత్ర సృష్టించిన బరానికా ఎలాంగోవన్.. ఆసియా క్రీడల పోల్ వాల్ట్‌లో భారత్‌కు మొట్టమొదటి పతకం!

Caption of Image.

Baranica Elangovan: జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడలలో భారత అథ్లెటిక్స్ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఉత్కంఠభరితంగా సాగిన పోల్ వాల్ట్ ఈవెంట్‌లో భారత స్టార్ అథ్లెట్ బరానికా ఎలాంగోవన్ (Baranica Elangovan) సంచలనం సృష్టిస్తూ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఆసియా క్రీడల పోల్ వాల్ట్ చరిత్రలో టీమిండియాకు పతకం సాధించిన తొలి అథ్లెట్‌గా బరానికా అరుదైన రికార్డు సృష్టించారు.

ఉత్కంఠ పోరులో మెరిసిన బరానికా: 

ఐచి-నగోయా గేమ్స్‌లోని మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో జరిగిన హోరాహోరీ పోరులో బరానికా ఎలంగోవన్ 4.15 మీటర్ల ఎత్తును విజయవంతంగా దూకి పోడియంను అధిరోహించారు. అయితే కజకిస్తాన్‌కు చెందిన పోలినా ఇవానోవా కూడా సరిగ్గా అదే 4.15 మీటర్ల ఎత్తును క్లియర్ చేసింది. వీరిద్దరి కౌంట్‌బ్యాక్ రికార్డులు కూడా ఒకేలా ఉండటంతో, ఇద్దరినీ సంయుక్తంగా మూడో స్థానంలో నిలిపారు. దీంతో బరానికాతో పాటు పోలినాకు కూడా కాంస్య పతకం దక్కింది. 

భారత అథ్లెటిక్స్ చరిత్రలో గోల్డెన్ మూమెంట్: 

భారత మహిళల పోల్ వాల్ట్ చరిత్రలో ఈ ఘనత సాధించడం ఇదే మొదటిసారి. బరానికా ఈ రికార్డు సృష్టించడానికి ముందు ఆసియా క్రీడలలో పోల్ వాల్ట్‌లో ఇండియాకు ఒక్క పతకం కూడా రాలేదు. ఈ అద్భుత ప్రదర్శనతో బరానికా ఎలంగోవన్ పేరు భారత క్రీడా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.

నేషనల్ రికార్డ్ హోల్డర్‌గా అదరగొడుతున్న టాలెంట్: 

ఈ ఏషియన్ గేమ్స్ పతకం కేవలం యాదృచ్ఛికంగా వచ్చింది కాదు, బరానికా నిలకడైన ఫామ్‌కు నిదర్శనం. ఈ ఏడాది ఆమె అద్భుతమైన ప్రదర్శనలతో దూసుకెళ్తున్నారు. అంతకుముందు ఈ ఏడాది మార్చిలో భువనేశ్వర్‌లో జరిగిన నేషనల్ ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 4.22 మీటర్ల ఎత్తుతో జాతీయ రికార్డును తన పేరిట లిఖించుకున్నారు. ఆ తర్వాత మే నెలలో జరిగిన ఇండియన్ ఓపెన్ కంబైండ్ ఈవెంట్స్ అండ్ పోల్ వాల్ట్ కాంపిటీషన్‌లో ఏకంగా 4.23 మీటర్ల ఎత్తును అధిగమించి తన సొంత రికార్డును తానే బ్రేక్ చేశారు. ప్రస్తుతం 4.23 మీటర్ల జాతీయ రికార్డు హోల్డర్‌గా ఉన్న బరానికా, ఇప్పుడు ఏషియన్ గేమ్స్‌లోనూ పతకం సాధించి తన సత్తా ఏంటో మరోసారి ప్రపంచానికి చాటిచెప్పారు. 

©️ VIL Media Pvt Ltd.