Reading Time: < 1 minute

బీసీలు ఐక్యంగా పోరాడితేనే హక్కులు సాధ్యం: మంత్రి వివేక్ వెంకటస్వామి

Caption of Image.

బీసీలు తమ హక్కులు, సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడాలని మైనింగ్, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో రజక సోదరులు తమ హక్కుల కోసం ముందుకు సాగాలని సూచించారు.

గతంలో ఎంపీగా ఉన్న సమయంలో పెద్దపల్లి ప్రాంతంలో మూడు విగ్రహాలను ఏర్పాటు చేయించానని మంత్రి తెలిపారు. గోదావరిఖని, చెన్నూరు ప్రాంతాల్లో రజక సంఘం నేతలు కమ్యూనిటీ భవనాలు, ప్లాట్‌ఫారమ్‌ల నిర్మాణానికి నిధులు కోరగా.. అందుకు అవసరమైన నిధులను కేటాయించినట్లు చెప్పారు. రజకులు తమ సమస్యలు, హక్కుల కోసం చేస్తున్న పోరాటాన్ని ఆయన అభినందించారు.

మున్సిపల్ ఎన్నికల్లో అనేక వార్డుల్లో బీసీల జనాభా, ఆధిపత్యం ఎక్కువగా ఉన్నప్పటికీ పెద్ద స్థాయి ఎన్నికల్లోనూ బీసీలు మరింతగా ప్రాతినిధ్యం సాధించాల్సిన అవసరం ఉందని వివేక్ వెంకటస్వామి అన్నారు. గతంలో ఎస్సీ, ఎస్టీలపై వివక్ష కారణంగా వారికి చట్టపరమైన రిజర్వేషన్లు వచ్చాయని, ప్రస్తుతం బీసీల్లోనూ మంచి నాయకత్వం, సామర్థ్యం ఉన్న నేతలు ఉన్నారని చెప్పారు. 

బీసీలందరూ కలిసికట్టుగా ఉద్యమిస్తే తమ హక్కులు సాధించుకోవచ్చని మంత్రి అన్నారు. బీసీల కోసం ఆర్. కృష్ణయ్య చేస్తున్న పోరాటాన్ని ప్రస్తావిస్తూ, బీసీల అభ్యున్నతి కోసం వి. హనుమంతరావు వంటి నేతల పట్టుదలను అభినందించారు. బీసీల హక్కుల సాధన కోసం పార్టీలకు అతీతంగా ఐక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందని మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు.

©️ VIL Media Pvt Ltd.