
న్యూఢిల్లీ: ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది సెప్టెంబర్ 24న లడఖ్‌లో నలుగురు మరణించిన హింసాకాండపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు తనను ఎన్కౌంటర్లో చంపేస్తారేమోనని భయమేస్తోందని హాట్ కామెంట్స్ చేశారు.
తన ప్రాణానికి ముప్పు ఉందని కొందరు హెచ్చరించానని.. అయితే, ఎలాంటి పర్యవసానానికైనా తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఒకవేళ తాను చనిపోతేనే జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా తిరిగి కల్పిస్తారంటే దానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు.
లడక్ ఆందోళన సమయంలో జరిగిన మరణాలకు అమిత్ షానే బాధ్యుడని.. ఆయన రాజీనామా చేయాల్సిందేనని తన డిమాండ్‌ను పునరుద్ఘాటించారు. భద్రతా సిబ్బంది స్థానిక యువకులపై ఏకే-47లతో సహా ఆటోమేటిక్ ఆయుధాలను ఉపయోగించారని.. ఆ తర్వాత వారిని దేశద్రోహులుగా ముద్ర వేశారని ఆయన ఆరోపించారు. లడక్ హింసాకాండ మొదటి వార్షికోత్సవం సందర్భంగా జరిగిన సభలో ఆయన ఈ కామెంట్స్ చేశారు.
లడఖ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా, 6వ షెడ్యూల్ రక్షణల కోసం 2025 సెప్టెంబర్ 24న జమ్మూ కశ్మీర్ ప్రజలు పెద్దఎత్తున ఆందోళణకు దిగారు. నిరసనలను అణిచివేసేందుకు పోలీసులు, భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో నలుగురు యువకులు మరణించారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించింది. అయితే, ప్రభుత్వం ఈ నివేదికను బహిర్గతం చేయలేదు.