
హైదరాబాద్ హోటల్స్‌లో వాడిన నూనెను మళ్లీ మళ్లీ వాడేస్తున్నారు.. ఫ్రీజర్‌లో కుళ్లిపోయిన ఆహారం.. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న రెస్టారెంట్ల నిర్వాహకుల గుట్టు రట్టవుతోంది. నగరంలోని హోటళ్లు, పబ్‌లలో ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా అధికారులు జరిపిన తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి.
హైదరాబాద్‌లోని ప్రముఖ మాదాపూర్ మొనాస్టరీ యాంఫి బ్రూవరీలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో వంటగదిలో ఏమాత్రం శుభ్రత లేకపోవడంతో పాటు పలు తీవ్ర ఉల్లంఘనలు బయటపడ్డాయి. ముఖ్యంగా ఆరోగ్యానికి హానికరమైన దాదాపు 5 కిలోల రీయూజ్డ్ వంట నూనెను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
ఇక రిఫ్రిజిరేటర్లను పరిశీలిస్తే మరింత దారుణమైన పరిస్థితులు కనిపించాయి. ఫ్రీజర్‌లో రోజుల తరబడి నిల్వ చేసిన వండిన ఆహార పదార్థాలతో పాటు, గడువు ముగిసిన ముడి పోర్క్ మాంసం కూడా ఉన్నట్లు తేలింది. ఎలాంటి లేబుల్స్, తయారీ తేదీలు లేని ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో భద్రపరచడం గమనార్హం. అంతేకాకుండా వంట తయారీ ప్రాంతంలో నిషేధిత సింథటిక్ ఫుడ్ కలర్లు, పగిలిన గుడ్లు, గడువు దాటిన పదార్థాలను వినియోగిస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు.
మొనాస్టరీ బ్రూవరీతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. వరంగల్ నగరంలోని అల్ఫారమ్ హోటల్‌లో నిబంధనల ఉల్లంఘనలను గుర్తించి యాజమాన్యానికి ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు జారీ చేశారు. అలాగే కామారెడ్డిలోని మల్గుడి రెస్టారెంట్‌లోనూ తనిఖీలు నిర్వహించి వంటశాల పరిశుభ్రత, ఆహార నిల్వ విధానాలను పరిశీలించారు.
ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా ఆహార భద్రతా అధికారులు రాష్ట్రవ్యాప్తంగా వరుస తడఖీలు చేపడుతున్నారు. గడువు తేదీలు, లేబులింగ్, నూనె పునర్వినియోగం వంటి నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు నిబంధనలు పాటించకపోతే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే అవుతుందని హెచ్చరిస్తూ తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారు.