
Varanasi Movie Update: దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సూపర్‌స్టార్ మహేశ్ బాబు, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీని కేఎల్ నారాయణ, ఎస్‌ఎస్ కార్తికేయ నిర్మిస్తున్నారు. 2027 ఏప్రిల్ 7న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. సినిమాకు సంబంధించిన ఆఫీషియల్ కంటెంట్ కంటే.. షూటింగ్, కథ, పాత్రలకు సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలే ప్రస్తుతం వారణాసిపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం నెట్టింట వైరల్‌గా మారింది.
వారణాసిలో మహేశ్ బాబు ‘రుద్ర’ అనే పాత్రలో కనిపించనున్నాడు. రాజమౌళి మార్క్ యాక్షన్, అడ్వెంచర్ అంశాలతో సినిమా తెరకెక్కుతున్నట్లు టాక్. ముఖ్యంగా సినిమాలో సుమారు 30 నిమిషాల పాటు సాగే భారీ యుద్ధ సన్నివేశం ఉండనున్నట్లు సమాచారం. ఈ వార్ సీక్వెన్స్ సినిమాలో కీలక ఘట్టంగా నిలుస్తుందని, ఇందులో శ్రీరాముడి ప్రస్తావన కూడా ఉంటుందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వారణాసి కథ ఒకే ప్రాంతానికి పరిమితం కాదని మరో ప్రచారం సాగుతోంది. కథలో భాగంగా భారత్‌లోని వారణాసితో పాటు అంటార్కిటికా, ఆఫ్రికా, ప్రాచీన రోమ్ వంటి విభిన్న ప్రాంతాలు కనిపించనున్నట్లు సమాచారం. విభిన్న భౌగోళిక నేపథ్యాల్లో కథను నడిపించడంతో పాటు భారీ స్థాయిలో యాక్షన్, అడ్వెంచర్ అంశాలను వారణాసిలో జోడిస్తున్నారని టాక్.
భారీ కథ, విస్తృతమైన కథా ప్రపంచం ఉన్న సినిమాలను రెండు భాగాలుగా తెరకెక్కించడం ఇటీవలి కాలంలో సాధారణంగా మారింది. అయితే వారణాసి విషయంలో మాత్రం మరో ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. ఈ కథను రెండు భాగాలుగా కాకుండా ఒకే చిత్రంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట. ఇంత భారీ కథను ఒకే సినిమాలో ఎలా చెప్పబోతున్నారు?.. కథనం ఏ స్థాయిలో ఉండబోతోంది?.. యాక్షన్, అడ్వెంచర్‌తో పాటు పౌరాణిక అంశాలను రాజమౌళి ఎలా మేళవించబోతున్నారు? అనే ప్రశ్నలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. మహేశ్ బాబు–రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న తొలి సినిమా కావడంతో ‘వారణాసి’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.