
అక్టోబర్ 15 నుండి రూ.2వేల కంటే ఎక్కువ విలువైన వ్యక్తి-నుండి-మర్చంట్ యూపీఐ చెల్లింపులపై 0.4 శాతం మర్చంట్ MDR ఛార్జీలు విధించాలని నిర్ణయించడంపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ కేంద్ర ప్రభుత్వాన్ని, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు.
6 కోట్ల మంది వ్యాపారుల్లో నిరాశ..
యూపీఐ చెల్లింపులపై ఛార్జీల నిబంధనల వల్ల దేశంలోని దాదాపు 6 కోట్ల మంది చిన్న షాపుల యజమానులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు తీవ్ర అసంతృప్తికి గురయ్యారని CTI చైర్మన్ బ్రిజేష్ గోయల్ ఫైనాన్స్ మినిస్టర్‌కు రాసిన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే అనేక పన్నులు, ఖర్చులతో సతమతమవుతున్న వ్యాపారులపై కొత్తగా మరో ఛార్జీల భారం మరింత ఆర్థిక ఇబ్బందులను తెచ్చిపెడుతుందని వారు వాపోతున్నారు.
పెద్ద లావాదేవీలపై తీవ్ర ప్రభావం..
ప్రభుత్వ లెక్కల ప్రకారమే FY2025-26లో రూ.3 లక్షల 14వేల కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగితే.. అందులో దాదాపు రూ.198 లక్షల కోట్ల విలువైన వ్యాపార చెల్లింపులే ఉన్నాయి. మొత్తం లావాదేవీల సంఖ్యలో రూ.2వేలకు పైబడినవి కేవలం 4 శాతమే అయినప్పటికీ.. వాటి ఆర్థిక విలువ మాత్రం రూ.లక్షా 31వేల కోట్లుగా ఉంది. ఈ భారీ లావాదేవీలపై ఎండీఆర్ పడటంతో.. భవిష్యత్తులో పెద్ద మొత్తాల చెల్లింపుల కోసం వ్యాపారులు యూపీఐకి బదులు క్యాష్ పేమెంట్స్ స్వీకరణ వైపు మెుగ్గుచూపే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
ప్రభుత్వం, ఎన్‌పీసీఐ వాదనలు..
ఈ ఆందోళనలపై స్పందించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, NPCI స్పష్టతనిచ్చాయి. ఇది ఎలాంటి ప్రభుత్వ పన్ను, సెస్ లేదా సర్ఛార్జ్ కాదని, వచ్చిన సొమ్ము ప్రభుత్వ ఖజానాకు చేరదని స్పష్టం చేశారు. వసూలయ్యే ఎండీఆర్ అమౌంట్‌లో 40% కస్టమర్ల బ్యాంకులకు, 30% పేమెంట్ గేట్‌వేకి, 20% యూపీఐ యాప్‌కి, 10% స్పాన్సరింగ్ బ్యాంకుకు పంపిణీ చేయబడుతుందని తెలిపారు. అలాగే చిన్న వ్యాపారులకు ఊరటగా నెలకు రూ.లక్ష వరకు లావాదేవీలు జరిపే వారికి మినహాయింపు ఉంటుందని, 96 శాతం రోజువారీ సాధారణ యూపీఐ చెల్లింపులు యథావిధిగా ఉచితంగానే కొనసాగుతాయని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. అసలు వ్యాపారులే యూపీఐ చెల్లింపులను నిరాకరించటం స్టార్ట్ చేస్తే దేశంలో డిజిటల్ ఎకానమీ ఆశలు కుంటుబడటం కాయం అంటున్నారు ఆర్థిక నిపుణులు. ఇదే జరిగితే మళ్లీ ప్రతి చిన్నదానికి డబ్బులు తీసుకెళ్లాల్సి రావటం పక్కా అంటున్నారు.
అక్టోబర్ 15 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్న నేపథ్యంలో.. రూ.2వేలు దాటిన లావాదేవీలపై పడే 18 శాతం జీఎస్టీపై చర్చించేందుకు అక్టోబర్ 7న జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అత్యంత కీలకంగా మారింది. కస్టమర్లపై ఎలాంటి భారం పడదని ప్రభుత్వం అంటున్నప్పటికీ.. వ్యాపారుల నుంచి వ్యక్తమవుతున్న నిరసనలను తగ్గించేందుకు కేంద్రం ఎలాంటి అడుగులు వేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
జరగబోయే రియాలిటీ ఇదే..
వ్యాపారులు ఒకవేళ డిజిటల్ పేమెంట్స్ స్వీకరించాలంటే తమ మార్జిన్లను పెంచుకుంటారు కాబట్టి ప్రభుత్వం తెచ్చిన 0.4 శాతం ఛార్జీలపై 18 శాతం జీఎస్టీ కలిపితే 0.472 శాతం అవుతుంది. ఈ మెుత్తాన్ని ఖచ్చితంగా జనం జేబులపైనే భారం పడుతుందన్నది రియాలిటీ. సో జనం కూడా తమ ఖర్చులు పెరగకుండా కాపాడుకునేందుకు క్యాష్ పేమెంట్స్ వైపుకు మారక తప్పదన్నమాట.