Reading Time: 2 minutes
AI తప్పిదం వల్లే.. ఇరాన్ పాఠశాలపై అమెరికా బాంబుల వర్షం. .123 మంది చిన్నారులు మృతి

2026 ఫిబ్రవరిలో ప్రాథమిక పాఠశాల ప్రాంతాన్ని ఏఐ (AI) నిఘా డేటాబేస్‌ ఇరాన్‌ ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (IRGC)కు చెందిన సైనిక స్థావరంగా గుర్తించడమే కారణమని తాజాగా దర్యాప్తులో బయటపడింది.  అయితే, కాలక్రమంలో ఆ ప్రాంతంలో చాలా మార్పులు జరిగాయి. పాత సైనిక స్థావరం ఉన్న ప్రదేశంలో తర్వాత పాఠశాల నిర్వహిస్తున్నప్పటికీ.. నిఘా డేటాబేస్‌లో ఆ ప్రాంతానికి సంబంధించిన సమాచారం అప్‌డేట్ కాలేదు. శాటిలైట్ చిత్రాల్లో పాఠశాల ప్రాంతాన్ని సైనిక స్థావరం నుంచి వేరు చేసేందుకు ప్రత్యేక గోడలు, ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేసారు. అక్కడ ఫుట్‌బాల్ మైదానం కూడా స్పష్టంగా కనిపించింది. పాఠశాలలో పౌర కార్యకలాపాలు జరుగుతున్నాయనడానికి అవి ముఖ్య ఆధారాలు.

Walls Separate School Satellite Images

Walls Separate School Satellite Images

తీవ్ర ఒత్తిడిలో నిర్ణయం

ఫిబ్రవరి 28న దాడులు ప్రారంభించే ముందు అమెరికా సైన్యం తీవ్ర ఒత్తిడిలో పనిచేసినట్లు దర్యాప్తులో బయటపడింది.  ఆ రోజు ఇరాన్‌లో 1,000 కి పైగా లక్ష్యాలపై దాడులు జరిపారు. సాధారణంగా ఒక లక్ష్యాన్ని గుర్తించి, దానిపై నిఘా సమాచారాన్ని పరిశీలించి, దాడికి అనుమతి ఇవ్వడానికి సమయం పడుతుంది. అయితే ఈసారి ఆ మొత్తం ప్రక్రియను రోజుల వ్యవధి నుంచి కొన్ని గంటలు, కొన్ని సందర్భాల్లో నిమిషాల వ్యవధిలోనే పూర్తి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంత తక్కువ సమయంలో భారీ సంఖ్యలో లక్ష్యాలను పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాల్సి రావడంతో.. నిఘా సమాచారాన్ని పూర్తిగా తనిఖీ చేయడం, లక్ష్యాలపై అదనపు పరిశీలనలు చేయడం వంటి ప్రక్రియలపై అమెరికా సెంట్రల్ కమాండ్ అధికారులపై ఒత్తిడి పడినట్లు తెలిసింది.

‘AI తప్పిదం’ మాత్రమే కాదా?

అమెరికా సెంట్రల్ కమాండ్ ఉపయోగించే Maven Smart AI  వ్యవస్థ శాటిలైట్ చిత్రాలు, రాడార్, డ్రోన్ ఫీడ్లు, ఇతర నిఘా సమాచారం ఆధారంగా ఇరాన్‌ లోని లక్ష్యాలను గుర్తించడంలో సాయం చేసింది. లక్ష్యాలను విశ్లేషించడం, ప్రాధాన్యతా క్రమంలో పెట్టడం, దాడికి సంబంధించిన సమాచారాన్ని సిద్ధం చేయడం వంటి పనులు చేసింది. అయితే పాత డేటా, అప్‌డేట్ కాని నిఘా సమాచారం, దానిని సరిచూసే మానవ ప్రక్రియలో లోపాలు స్పస్టంగా బయటపడ్డాయి.

‘కిల్ చైన్’ అంటే ఏమిటి?

అమెరికా సైనిక పరిభాషలో ‘కిల్ చైన్’ అంటే ఒక లక్ష్యాన్ని గుర్తించినప్పటి నుంచి దానిపై దాడి చేసే వరకు జరిగే మొత్తం ప్రక్రియ. ముందుగా లక్ష్యాన్ని గుర్తిస్తారు. ఆ తర్వాత దాని వివరాలను పరిశీలిస్తారు. అది నిజంగా సైనిక లక్ష్యమేనా? అక్కడ పౌరులు ఉన్నారా? వంటి అంశాలను తనిఖీ చేస్తారు. చివరగా దాడికి అనుమతి ఇచ్చి ఆయుధాన్ని ప్రయోగిస్తారు.

మానవ తనిఖీ ఎందుకు కీలకం?

పాత నిఘా సమాచారం, అప్‌డేట్ కాని చిత్రాలు, AIపై అధికంగా ఆధారపడటం వంటి అంశాలు దాడికి దోహదపడ్డాయని సెంట్ కామ్ అంతర్గత సమీక్షలో గుర్తించారు. పాత డేటా, సరైన సమయంలో అప్‌డేట్ కాని సమాచారం, మానవ తనిఖీలో లోపాలు.. ఇవన్నీ కలిసి ప్రమాదకరమైన పాఠశాల దాడికి దారితీసినట్లు గుర్తించారు. AI వ్యవస్థ ఎంత ఆధునికమైనది అయినా దానికి అందే సమాచారం సరైనదిగా ఉండాలి. ముఖ్యంగా పౌరుల ప్రాణాలకు సంబంధించిన సైనిక నిర్ణయాల్లో మానవుల తుది పరిశీలన కీలకం. ఈ ఘటన తర్వాత అమెరికా సెంట్రల్ కమాండ్ తన లక్ష్య నిర్ధారణ ప్రక్రియలో మార్పులు చేసింది.

A Mother Grieves For Her Child At A School In Iran

A Mother Grieves For Her Child At A School In Iran

మినాబ్‌లోని పాఠశాలపై దాడి, దాంతో పాటు ఇరాన్‌లోని మరో ప్రాంతంలో జరిగిన అమెరికా దాడులు యుద్ధ నేరాలుగా పరిగణించే స్థాయిలో ఉన్నాయనేందుకు ‘సహేతుకమైన ఆధారాలు’ ఉన్నాయని ఐక్యరాజ్యసమితి ప్రత్యేక దర్యాప్తు బృందం  కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే అమెరికా ఈ ఆరోపణలను అంగీకరించలేదు. పెంటగాన్‌ స్పందిస్తూ.. ఈ ఘటనపై తమ దర్యాప్తు కొనసాగుతోందని, ప్రస్తుతం వెల్లడించడానికి ఏమీ లేదని తెలిపింది. ఇక్కడ మరో విషయం ఏమిటంటే ఐరాస ఫ్యాక్ట్-ఫైండింగ్ మిషన్ న్యాయస్థానం కాదు. శిక్ష విధించే అధికారం కలిగిన సంస్థ కాదు. అయితే దాని నివేదికలోని ఆధారాలు భవిష్యత్‌లో అంతర్జాతీయ న్యాయపరమైన దర్యాప్తులకు ఉపయోగపడే అవకాశం ఉంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తలకు క్లిక్ చేయండి