Reading Time: 2 minutes
Madras High Court House Husbands Homemakers Marriage Doctor Couple

కుటుంబ వ్యవస్థను కాపాడటానికి గృహానికి భర్త కూడా అవసరమేనని.. మహిళలు మాత్రమే ఎందుకు ఇంటి పనులకే పరిమితం కావాలని మద్రాస్ హైకోర్టు ప్రశ్నించింది. ఇద్దరు వైద్య దంపతుల విడాకుల విచారణ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.

భార్యాభర్తలిద్దరూ పనులు పంచుకుంటూనే కుటుంబాలు, వివాహాలు కాపాడబడతాయని వ్యాఖ్యానించింది. ‘గృహణి’ అనే పదం లింగ తటస్థమైందని అభిప్రాయపడింది. సమాజంలో ఇప్పుడు భర్తలు కూడా ఇంటి పనుల్లో సర్వసాధారణం కావాలని తెలిపింది. కుటుంబాలను, వివాహాలను కాపాడటానికి ఇది చాలా అవసరం అని పేర్కొంది. జస్టిస్‌లు జి.ఆర్. స్వామినాథన్, ఎం.డి. సుమతిలతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది.

గృహిణులుగా కేవలం మహిళలు మాత్రమే ఎందుకు ఉండాలని ఆశిస్తున్నారని ప్రశ్నించింది. గృహిణులు చేసే పనికి గొప్ప ఆర్థిక ప్రాముఖ్యత ఉందని కూడా ధర్మాసనం అభిప్రాయపడింది. సెప్టెంబర్ 23న జరిగిన విచారణ సందర్భంగా న్యాయస్థానం.. ‘‘గృహిణులు ఉండగలిగినప్పుడు.. భర్తలు కూడా ఉండగలరు. ఇది ఇప్పుడు సాధారణం కావాలి.’’ అని పేర్కొంది.

భారతీయ సమాజం పాశ్చాత్య సమాజానికి భిన్నమైనదని కోర్టు తెలిపింది. ‘‘వివాహం కుటుంబంలో ఒక భాగం. కుటుంబం ఒక సామాజిక విభాగం. ఈ వ్యవస్థలో పురుషులు ఆర్థిక బాధ్యతలు చూసుకుంటుండగా… మహిళలు ఇంటిని నిర్వహిస్తున్నారు. ఈ రెండు పాత్రలకూ సమాన గౌరవం ఉందని అర్థం చేసుకోవడం ముఖ్యం.’’ అని ధర్మాసనం పేర్కొంది. ‘‘గత 50 ఏళ్లలో పరిస్థితి మారింది. ఇటీవలి వరకు మహిళలు సంతోషంగా తమను తాము గృహిణులుగా పిలుచుకునేవారు. ఇప్పుడు వారు దానిని సరిగా స్వీకరించడం లేదు. కేవలం గృహిణి అని పిలవడం వారిని బాధిస్తుంది.’’ అని కోర్టు తెలిపింది.

ఈ రోజుల్లో మహిళలు పెళ్లికి దూరంగా ఉంటున్నారు. పెళ్లికాని వారి సంఖ్య పెరుగుతోంది. బార్ అండ్ బెంచ్ నివేదిక ప్రకారం.. పరిస్థితులు ఎంత వేగంగా మారిపోయాయంటే.. కెరీర్‌పై దృష్టి సారించే మహిళలు అటువంటి పరిస్థితిని ఎదుర్కోకుండా ఉండేందుకు వివాహానికి దూరంగా ఉంటున్నారని న్యాయమూర్తి అన్నారు. పురుషులు గృహస్థులుగా మారడానికి సంకోచించనప్పుడే ఇలాంటి పరిస్థితిని నివారించవచ్చని పేర్కొన్నారు. కోర్టు వ్యాఖ్యానిస్తూ.. ‘‘మహిళలు తమ కెరీర్‌పై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. ఇది కొన్నిసార్లు సంబంధాలను ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా ఐటీ రంగంలో.. కొన్ని ఇతర వృత్తులలో.. కొన్నిసార్లు కెరీర్ మహిళలకు వివాహం సరైనదిగా ఉండటం లేదు. వారు వివాహాన్ని తమ కెరీర్‌కు ఆటంకంగా భావించి.. దానికి దూరంగా ఉంటున్నారు. పెళ్లికాని మహిళల సంఖ్య పెరుగుతోంది. పురుషులను కూడా గృహస్థులుగా మారేలా ప్రోత్సహించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు..’’ అని న్యాయస్థానం అభిప్రాయపడింది.

వైద్య దంపతుల మధ్య జరిగిన వైవాహిక వివాదానికి సంబంధించి హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. కుటుంబ న్యాయస్థానం తీర్పును సవాలు చేశారు. భర్త దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. హైకోర్టు ఇలా పేర్కొంది. ‘‘వివాహాలు ఇద్దరికీ ఇబ్బందికరంగా ఉంటాయి. అయితే ఒక చట్టపరమైన నిర్ణయం ఒక వ్యక్తిని సంతోషపెట్టగలదు. కానీ కుటుంబ న్యాయస్థానం ఇద్దరినీ అసంతృప్తికి గురిచేసింది.’’ అని వ్యాఖ్యానించింది. న్యాయస్థానం గమనించినదేమిటంటే.. మహిళా దంతవైద్యురాలు తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తూ వారి పిల్లలను పెంచుతుండగా.. ఆమె భర్త కార్డియాలజీ చదివాడు. దీంతో వివాహంలో భర్త వృత్తిపరంగా విజయం సాధించాడు. కానీ ఆ మహిళ సాధించలేకపోయింది. కుటుంబాన్ని పోషించడం కోసం ఆ మహిళ తన చదువును, వృత్తిని త్యాగం చేసిందని న్యాయస్థానం పేర్కొంది.