
భారతీయ టెక్ వ్యాపారవేత్త గౌరవ్ ఖేతర్‌పాల్ అమెరికా వెళ్లిన సమయంలో ఈ అనుభవం ఎదురైంది. హోటల్‌కు వెళ్లేందుకు ఆయన Lyft క్యాబ్ బుక్ చేశారు. క్యాబ్ వచ్చే ముందు.. తనకు కేటాయించిన డ్రైవర్‌కు వినికిడి లోపం ఉందని యాప్ ద్వారా సమాచారం అందింది. అంతేకాదు డ్రైవర్‌తో సులభంగా కమ్యూనికేట్ చేసేందుకు యాప్‌లోనే “అమెరికన్ సైన్ లాంగ్వేజ్” (ASL)కు సంబంధించి కొన్ని పదాలను చూపించింది. ‘హలో’, ‘థ్యాంక్యూ’ వంటి పదాలను ఎలా సైగలతో చెప్పాలో కూడా స్క్రీన్‌పై కనిపించింది.
క్యాబ్ వచ్చింది.. డ్రైవర్ ఇచ్చిన కార్డు చూసి షాక్!
క్యాబ్ అక్కడికి చేరుకున్న తర్వాత డ్రైవర్ గౌరవ్‌కు ఓ చిన్న కార్డు అందించారు. తనకు వినికిడి లోపం ఉందని, అందుకే మాట్లాడటంలో ఇబ్బంది ఉంటుందని ఆ కార్డులో రాసి ఉంది. అదే సమయంలో ప్రయాణికుడికి స్వాగతం కూడా పలికారు. గౌరవ్ కూడా స్పందించారు. సైన్ లాంగ్వేజ్‌లో ‘థ్యాంక్యూ’ చెప్పారు.
ఈ చిన్న అనుభవాన్ని గౌరవ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
“ఇలాంటి అవకాశాలు మన దగ్గర ఎప్పుడు?”
ఈ ఘటన తనకు ఆలోచన కలిగించిందని గౌరవ్ తెలిపారు. వికలాంగులకు ఉద్యోగాలు కల్పించే విషయంలో కేవలం ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవ్వడం మాత్రమే కాకుండా..సమాజంలోని అన్ని రంగాల్లో సమాన అవకాశాలు, గౌరవం లభించే పరిస్థితి ఎప్పుడు వస్తుంది? అనే ప్రశ్నను ఆయన లేవనెత్తారు. అమెరికాలో కూడా అనేక సమస్యలు ఉన్నాయని చెబుతూనే..వైకల్యం ఉన్నవారికి అవకాశాలు కల్పించే విషయంలో తాను చూసిన ఈ అనుభవం తనను ఆకట్టుకుందని తెలిపారు.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన పోస్టు
గౌరవ్ ఖేతర్‌పాల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వికలాంగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న కొన్ని సంస్థలను పలువురు నెటిజన్లు ప్రస్తావించారు.
అమెజాన్ వంటి సంస్థల్లో వినికిడి లోపం ఉన్నవారు ప్యాకింగ్, ఇన్వెంటరీ లో పనిచేస్తున్నారని ఓ యూజర్ తెలిపారు. బెంగళూరులో Uber క్యాబ్ బుకింగ్ సమయంలో డ్రైవర్‌కు సంబంధించిన కొంత సమాచారం కనిపిస్తుందని, అయితే సైన్ లాంగ్వేజ్ అవసరమనే సమాచారం కూడా ఉంటే మరింత ఉపయోగకరంగా ఉంటుందని మరో నెటిజన్ అభిప్రాయపడ్డారు. ఇండిగో విమాన సంస్థలో కూడా చెవిటితనం ఉన్న ఉద్యోగులను చూసినట్లు మరో వ్యక్తి తన అనుభవాన్ని పంచుకున్నారు.
అయితే ఈ పోస్టుపై అందరూ ఒకే అభిప్రాయంతో స్పందించలేదు. కొంతమంది భద్రతకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా రోడ్డుపై అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు వినికిడి లోపం ఉన్న డ్రైవర్‌కు హారన్‌లు, సైరన్లు లేదా ఇతర శబ్ద సంకేతాలు వినిపించకపోవచ్చని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు.
మరికొందరు మాత్రం వినికిడి లోపం ఉన్న వ్యక్తులకు కూడా తగిన సాంకేతిక సదుపాయాలు, స్పష్టమైన కమ్యూనికేషన్ వ్యవస్థలు అందిస్తే వారు అనేక రంగాల్లో సమర్థంగా పనిచేయగలరని కామెంట్ చేసారు.
ఒక్క క్యాబ్ ప్రయాణం.. పెద్ద చర్చకు దారి
గౌరవ్‌కు ఇది కేవలం ఒక క్యాబ్ ప్రయాణం కావొచ్చు. కానీ ఆ ప్రయాణంలో ఎదురైన అనుభవం వికలాంగులకు సమాన అవకాశాలు, టెక్నాలజీ ద్వారా కమ్యూనికేషన్, ఉద్యోగాల్లో చేరిక, ప్రయాణ భద్రత వంటి అనేక అంశాలపై చర్చకు దారితీసింది. ఒక యాప్‌లో కనిపించిన చిన్న నోటిఫికేషన్‌తో మొదలైన ఈ కథ.. చివరకు “వికలాంగులకు సమాజం నిజంగా ఎంతవరకు సమాన అవకాశాలు కల్పిస్తోంది?” అనే పెద్ద ప్రశ్నను ముందుకు తెచ్చింది.