
ఖమ్మం/ కొణిజర్ల, వెలుగు: అర్నాబ్ తుఫాన్ ఎఫెక్ట్ తో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఖమ్మం జిల్లాలో మూడు రోజులుగా ముసురు పట్టడంతో చేతికందిన పత్తి నల్లబడుతోంది. జిల్లాలో ఈ ఏడాది 2 లక్షలకు పైగా ఎకరాల్లో పత్తి సాగైంది.
ప్రస్తుతం పత్తి పంట చేతికొచ్చే దశలో ఉండడంతో పాటు కాయలు విచ్చుకునే సమయంలో వర్షాలు కురుస్తుండడంతో పంట దెబ్బతింటోంది. ముసురుతో పత్తి పువ్వులు రాలిపోవడంతో పాటు కాయలు నల్లబడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పలు చోట్ల పత్తి మొక్కలు నేలకొరిగాయి. దీంతో దిగుబడి గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది పత్తిపైనే నమ్మకం పెట్టుకుని మిర్చి పంటతో సమానంగా పెట్టుబడి పెట్టామని, పంట చేతికి వచ్చే సమయంలో వర్షాలు నష్టాన్ని మిగిల్చాయని వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని పరిశీలించి, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.