
హైదరాబాద్, సెప్టెంబర్ 27: రాష్ట్రంలో తొలిసారిగా ఇన్‌సర్వీస్ టీచర్ల కోసం నిర్వహించిన ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో 70.07 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇప్పటివరకు నిర్వహించిన టెట్‌లతో పోలిస్తే ఇదే అత్యధిక ఉత్తీర్ణత శాతమని పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. సెప్టెంబరు 8, 9 తేదీల్లో నిర్వహించిన ఈ ప్రత్యేక టెట్‌కు పేపర్ 1, పేపర్ 2లకు కలిపి 24,986 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 22,477 మంది పరీక్షకు హాజరుకాగా.. 15,749 మంది అర్హత సాధించారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ సెప్టెంబరు 26న సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌లో ఫలితాలను విడుదల చేశారు. కార్యక్రమంలో ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్, టెట్ కన్వీనర్ జీ. రమేశ్, టెట్ డిప్యూటీ డైరెక్టర్ రేవతిరెడ్డి పాల్గొన్నారు.
పేపర్-1, పేపర్-2లను కలిపి జిల్లాల వారీగా చూస్తే సూర్యాపేట జిల్లా 80.76 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలిచింది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా 52.38 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో ఉంది. అయితే పరీక్షకు హాజరైన వారిలో 6,728 మంది అర్హత సాధించలేకపోయారు. పేపర్-1లో 1,544 మంది, పేపర్-2 (గణితం, సైన్స్)లో 2,411 మంది, పేపర్-2 (సోషల్)లో 2,773 మంది ఫెయిలయ్యారు.
2028 ఆగస్టులోగా టెట్ తప్పనిసరి.. నవంబర్‌లో మరో ప్రత్యేక టెట్
ఇన్‌సర్వీస్ టీచర్ల కోసం మరో ప్రత్యేక టెట్‌ను నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ‘స్పెషల్ టెట్ ఇన్‌సర్వీస్ టీచర్స్-2’ పేరుతో ఈ పరీక్ష జరగనుంది. అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు టెట్ కన్వీనర్ జీ. రమేశ్ తెలిపారు. నవంబర్ 16 నుంచి 21 వరకు ఆన్‌లైన్ విధానంలో (సీబీటీ) పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగంలో కొనసాగుతున్న ఉపాధ్యాయులు 2028 ఆగస్టు నాటికి టెట్ ఉత్తీర్ణత సాధించాలని 2025 సెప్టెంబరులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో టెట్ అర్హత లేని ఇన్‌సర్వీస్ టీచర్ల కోసం రెండు ప్రత్యేక టెట్‌లను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్రంలో సుమారు 70 వేల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు టెట్ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుందని అంచనా వేయగా.. గత రెండు రెగ్యులర్ టెట్‌ల ద్వారా సుమారు 47 వేల మంది అర్హత సాధించారు. తాజా ప్రత్యేక టెట్ ఫలితాలను కలుపుకుంటే ఇప్పటివరకు దాదాపు 63 వేల మంది టెట్ పాస్ అయ్యారని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. ఇంకా రాష్ట్రంలో టెట్ ఉత్తీర్ణత సాధించాల్సిన ప్రభుత్వ ఉపాధ్యాయులు 10 వేల మందికి మించి ఉండరని ఆయన వెల్లడించారు. ఇన్‌సర్వీస్ టీచర్ల కోసం ప్రత్యేక టెట్‌తో పాటు ఈ ఏడాది రెండో రెగ్యులర్ టెట్‌ను కూడా నిర్వహించనున్నారు. దీనికి నవంబర్ రెండో వారంలో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు నవీన్ నికోలస్ తెలిపారు. పరీక్షలను జనవరిలో నిర్వహించే అవకాశం ఉందని వెల్లడించారు.