
తీవ్ర వాయుగుండం తీరం దాటినా.. వర్షాల అలర్ట్ కొనసాగుతూనే ఉంది. తీవ్ర వాయుగుండం మరికొన్ని గంటల్లో బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. 24 గంటల్లో మరింత బలహీనపడే అవకాశం కనిపిస్తుందని తెలిపారు. అయినా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. మొత్తంగా మరో రెండ్రోజులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేశారు. ఏపీలోని 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. 16జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి.. ఉత్తర కోస్తాపై తీవ్రంగా వర్షాల ప్రభావం కనిపిస్తోంది. నదీ పరివాహక ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు ఉందని.. అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేశారు. వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు.
వర్షాలపై కూటమి ప్రభుత్వం అలర్ట్ అయింది. వర్షాలు, నీటి ప్రవాహాలపై దృష్టి పెట్టిన సీఎం చంద్రబాబు.. అధికారులతో సమీక్ష నిర్వహించారు. గోదావరి, కృష్ణా, నాగావళి, వంశధార, గొట్టా బ్యారేజీ, భద్రాచలం, ధవళేశ్వరం దగ్గర వరద ప్రవాహంపై అధికారులతో చర్చించారు. వర్షాల నేపథ్యంలో వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అన్ని రిజర్వాయర్లు, చెరువులు నింపాలని, అవసరమైన చోట మొబైల్ లిఫ్టులతో నీటిని తరలించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు..
తెలంగాణలో వర్షాలు..
ఇటు తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాలకు వర్ష సూచన చేసింది. తెలంగాణలో 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. ఖమ్మం, కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, కరీంనగర్.. పెద్దపల్లి, మంచిర్యాల, కొమురం భీం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ 8 జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని 17 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నల్గొండ, యాదాద్రి, జగిత్యాల, కామారెడ్డి జిల్లాలు, మహబూబ్‌నగర్, మెదక్, సిద్దిపేట, సూర్యాపేట, సంగారెడ్డి, వనపర్తి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..