
KTR: రాజేంద్రనగర్ నియోజకవర్గంలో మనం గెలిపించిన ఎమ్మెల్యే స్వార్థం కోసం పార్టీ మారినా, క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్, నాయకులు మాత్రం బీఆర్‌ఎస్‌తోనే బలంగా ఉన్నారని కేటీఆర్ స్పష్టం చేశారు. మరో నెల రెండు నెలలు గడిస్తే ఈ ప్రభుత్వం వచ్చి మూడేళ్లు పూర్తవుతుందని గుర్తు చేశారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. గత పది పదిహేను ఒకాయనకు సరిగా నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పోలీసులు ప్రెస్ మీట్‌లు పెట్టి ఏ పాటలు పెట్టుకోవాలి, ఏవి పెట్టకూడదో ఆదేశిస్తున్నారని, తెలంగాణ సంస్కృతిలో భాగమైన డీజేలను బంద్ చేసే పనిలో పడ్డారని మండిపడ్డారు. పోలీసులు నేరుగా వెళ్లి డీజేలను గుంజుకుంటున్నారన్నారు. వినాయకనిమజ్జనంలో సీపీ సజ్జనార్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిల ముందు కూడా కేసీఆర్ పాటలు పెట్టారని గుర్తుచేశారు.
బీఆర్‌ఎస్‌కు పోయింది కేవలం అధికారం మాత్రమేనని, కానీ కేసీఆర్ మీద ప్రజలకు ఉన్న అభిమానం ఎక్కడా తగ్గలేదని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రజలు కేసీఆర్‌ను గుర్తు చేసుకుంటున్నారని, మళ్లీ కేసీఆర్ పాలన ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారని తెలిపారు. ప్రాజెక్టుల్లో నీళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ పంటలకు ఇవ్వకుండా రైతులను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు 30 శాతం కమీషన్లు వసూలు చేస్తూ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగాన్ని పూర్తిగా నాశనం చేశారని ఆరోపించారు.
“మనం అధికారంలో ఉంటే రాయదుర్గం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లైన్ పూర్తి అయ్యేది. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ పూర్తిగా తగ్గేది. టెండర్ పూర్తి చేసిన నెల రోజుల్లో మన సర్కార్ పోయింది. ఈ సర్కార్ రాగానే మొట్టమొదట చేసిన పని ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు చేయడమే. ఈరోజు రేవంత్ రెడ్డి రాగానే మూసి పరిధిలో ఇళ్ళు కూలగొడ్తాం అంటున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు 57, 58 జీవో కింద ఇండ్లు రెగ్యులరైజ్ చేశారు. హైదరాబాద్ పరిధిలో లక్ష డబుల్ బెడ్ రూమ్‌లు కట్టించాం. వాళ్లు అధికారంలోకి వచ్చి మూడేళ్లు అయింది హైదరాబాద్‌లో ఒక్క ఇల్లు కట్టలేదు. ఉన్న సిటీలో దోమల మందు కొట్టేవాళ్ళు లేరు.. కానీ ఫ్యూచర్ సిటీ కడతాం అంటున్నారు. మీ ఎమ్మెల్యే పని కూడా ఐపోయింది. భూముల కోసం పార్టీ మారారు. ఈరోజు కొన్ని వానపాములు కూడా నాగు పాముల్లాగా బుసలు కొడుతున్నాయి. మనం అధికారంలోకి రాగానే ఎవరిని వదిలిపెట్టం. కొంత మంది డిగ్రీ సర్టిఫికెట్‌లు లేకున్నా డిగ్రీ అని చెప్పు కుంటున్నారు. రేపటి నుంచి ఎన్రోల్మెంట్ స్టార్ట్ అవుతుంది. పట్టభద్రులు అందరూ ఎన్రోల్మెంట్ చేసుకోవాలి.” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.