Reading Time: < 1 minute
Sir Row Bjp Allies Urge Cec Gyanesh Kumar To Clarify Election Commissions Position

SIR Row: ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై ఎన్నికల సంఘంలో అంతర్గత భిన్నాభిప్రాయాలు ఉన్నాయనే నివేదికల నేపథ్యంలో, ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో బీజేపీ మిత్రపక్షాలు కేంద్ర ఎన్నికల సంఘానికి కీలక విన్నపం చేశాయి. ఈ ఆరోపణలపై స్పందించి, ప్రజల సందేహాలు తొలగించాలని కోరాయి. కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్, రాష్ట్రీయ లోక్ మోర్చా(ఆర్ఎల్ఎం) నేత ఉపేంద్ర కుష్వాహా, తెలుగుదేశం నేతలు ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో సందేహాలను నివృత్తి చేయాలని అన్నారు.

పాట్నాలో మాట్లాడిన ఎల్జేపీ(రామ్ విలాస్) నేత చిరాగ్ పాశ్వాన్, ఎన్నికల సంఘం స్వతంత్ర రాజ్యాంగ సంస్థ కాబట్టి తాము దానిని ప్రభుత్వం తరుఫున సమర్థించాల్సిన అవసరం లేదని, ప్రతిపక్షాలు రాజకీయ విమర్శలు చేయడం సహజమే అని, అయితే విమర్శలకు సమాధానం ఇవ్వడం కోసం కాకుండా ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు ఈసీ తన వైఖరిని వెల్లడించాలని అన్నారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో అనుమానాలు పెరగడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని పాశ్వాన్ అఅన్నారు. రాహుల్ గాంధీ, ఇతర ప్రతిపక్షాలకు సమాధానం ఇవ్వా్ల్సిన అవసరం లేదని, ఓటర్లలో సందేహాలను ఎన్నికల సంఘం నివృత్తి చేయాలని అన్నారు.

ఆర్ఎల్ఎం నేత ఉపేంద్ర కుష్వాహా మాట్లాడుతూ.. ప్రజల్లో ఎస్ఐఆర్‌పై గందరగోళం ఏర్పడిందని, ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వాలని అన్నారు. టీడీపీ లోక్‌సభ ఫ్లోర్ లీడర్ లావు శ్రీకృష్ణ దేవరాయలు.. ఆంధ్రప్రదేశ్‌లో ఎస్ఐఆర్ పారదర్శకంగా నిర్వహించారని అన్నారు. ఇదే సమయంలో పశ్నలు తలెత్తితే, వివరణ ఇస్తే ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తుందని అన్నారు.

దీనికి ముందు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం దేశంలో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది. ఎన్నికల సంఘంలో ఇద్దరు కమిషనర్లు 10 నెలల్లో 14 సందర్భాల్లో ఎస్ఐఆర్, పేర్ల తొలగింపు, ఓటర్ల డేటా సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన విషయాల్లో అభ్యంతరం తెలిపినట్లు నివేదించింది. దీంతో ప్రతిపక్షాలు CEC జ్ఞానేష్ కుమార్‌‌ను టార్గెట్ చేశాయి. ఆయన రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.