Reading Time: 2 minutes

UPI ఫ్రీ డేస్ కౌంట్‌డౌన్ షురూ: ఛార్జీల మోతతో రూటు మార్చేస్తున్న చిన్న వ్యాపారులు

Caption of Image.

ఒక కప్పు చాయ్ నుంచి మొదలుకుని కూరగాయలు, కిరాణా సామాగ్రి, కరెంటు బిల్లుల దాకా ప్రజల నిత్య జీవితంలో UPI ఒక భాగమైపోయింది. రూపాయి చిల్లర ఇవ్వాలన్నా, వేల రూపాయలు చెల్లించాలన్నా ఇప్పుడు అందరి వేళ్లు ఫోన్ల వైపే వెళ్తున్నాయి. అయితే దేశాన్ని డిజిటల్ బాట పట్టించిన ఈ హోమ్‌గ్రోన్ పేమెంట్ సిస్టమ్‌పై ఇప్పుడు ఛార్జీల మేఘం అలుముకుంది. అక్టోబర్ నుంచి రానున్న కొత్త బాదుడుపై వ్యాపార వర్గాల్లో తీవ్ర ఆందోళన స్టార్ట్ అయ్యింది.

చిరు వ్యాపారుల గుండెల్లో గుబులు.. 
చిల్లక కష్టాలు తీరుతోందని ఇన్నాళ్లూ యూపీఐ లావాదేవీలను ప్రోత్సహించిన వ్యాపారులు ఇప్పుడు దానిపై సందిగ్ధంలో పడ్డారు. యూపీఐ పూర్తిగా ఉచితంగా సాగిపోవడంతో చిన్న, పెద్ద వ్యాపారులు దీనిని గుండెలకు హత్తుకున్నారు. కానీ రాబోయే అక్టోబర్ నుంచి రూ.2వేల కంటే ఎక్కువ విలువైన పర్సన్-టు-మర్చంట్ చెల్లింపులపై 0.4 శాతం ఛార్జీలు విధించనున్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని ఓ కిరాణా దుకాణాదారుడు చెబుతున్నట్లుగా.. రోజువారీ లావాదేవీల్లో చాలా వరకు చిన్నవే అయినప్పటికీ, రూ.2వేలు దాటే పెద్ద ఆర్డర్లు కూడా ఎక్కువే ఉంటాయన్నాడు. కేవలం 18 నుంచి 19 శాతం మార్జిన్‌తో, ఖర్చులన్నీ పోను 2-3 శాతం లాభం మిగిలే చిరు వ్యాపారులపై రాబందుల్లా 0.4 శాతం ఛార్జీలు పీక్కు తినటం బాధాకరం అంటున్నాడు. 

క్యాష్ లెవెల్స్‌కు రివర్స్ ప్రయాణమా?
రీటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సీఈఓ రాజగోపాలన్ ప్రకారం.. పెద్ద వ్యాపారులు ఈ భారాన్ని భరించగలరేమో కానీ, చిన్న వ్యాపారులు మాత్రం తీవ్రంగా నష్టపోతారన్నారు. క్రెడిట్ కార్డుల బాధ భరించలేక యూపీఐ వైపు మళ్లిన వ్యాపారులకు ఇప్పుడు కొత్త ఛార్జీలు షాకిచ్చాయి. నీతి ఆయోగ్ మాజీ వైస్-ఛైర్మన్ రాజీవ్ కుమార్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. స్థానిక ఛాట్‌వాలాలు, జ్యూస్ షాపుల వారి రోజువారీ సంపాదన రూ.5వేలు దాటుతుందని, అంటే నెలవారీగా చూస్తే అది రూ.లక్ష దాటిపోయి పీ2ఎం పరిధిలోకి వస్తుందని హెచ్చరించారు. ఈ పరిమితుల వల్ల మళ్లీ కోట్లాది మంది చిన్న వ్యాపారులు క్యాష్ లావాదేవీల వైపు తిరిగి వెళ్లక తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది.

చివరికి భారం ఎవరిపై పడుతుంది?
ప్రభుత్వం కస్టమర్లకు ఇబ్బంది లేదని చెబుతున్నప్పటికీ.. రిటైల్ రంగ నిపుణులు మాత్రం పరోక్షంగా ఈ భారం వినియోగదారుడి పైనే పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఇన్నాళ్లు 10 రూపాయలకు అమ్మిన వస్తువు కాస్తా 15 రూపాయలు అవుతుందని వారు అంటున్నారు. చిన్న వ్యాపారులు వస్తువుల ధరలను పెంచడం లేదా డిస్కౌంట్లు తగ్గించడం ద్వారా ఈ ఎండీఆర్ మొత్తాన్ని రికవరీ చేసే ప్రమాదం ఉంది. ఏది ఏమైనప్పటికీ.. భారతీయ డిజిటల్ పేమెంట్ రంగంలో ఒక సరికొత్త మలుపుగా మారుతున్న ఈ ఎండీఆర్ వివాదం.. అక్టోబర్ రాకతో ఏ రూపు దాల్చుతుందో, చిన్న వ్యాపారులకు ప్రభుత్వం ఎలాంటి ఊరట కల్పిస్తుందో వేచి చూడాలి.

©️ VIL Media Pvt Ltd.