Reading Time: 2 minutes

బాలాపూర్ గణేష్ నిమజ్జనం పూర్తి.. శోభాయాత్ర సాగిందిలా..

Caption of Image.

ఖైరతబాద్ మహాగణపతి తర్వాత అంతే స్థాయిలో పేరు గాంచిన బాలాపూర్ గణేష్ నిమజ్జనం పూర్తయింది. 2026 సెప్టెంబర్ 25వ తేదీన సాయంత్రం 4.36 గంటలకు నిమజ్జనం పూర్తి చేశారు. క్రేన్ నెంబర్ 12 దగ్గర నిమజ్జనం జరిగింది. 

 బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాట ముగిసిన వెంటనే అత్యంత వైభవంగా శోభాయాత్ర ప్రారంభమైంది. ప్రసిద్ధి గాంచిన బాలాపూర్ వినాయకుడిని దర్శించుకోవడానికి, అలాగే శోభాయాత్రను ప్రత్యక్షంగా చూడడానికి వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు.

నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు 

హుస్సేన్ సాగర్ తీరంతో పాటు నిమజ్జనం జరిగే అన్ని ప్రాంతాలలో అధికారుల పర్యవేక్షణలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. వినాయక విగ్రహాలను త్వరితగతిన గంగమ్మ ఒడికి చేర్చే విధంగా భారీ క్రెయిన్లను సిద్ధం చేశారు. భక్తుల రద్దీని నియంత్రించడానికి ప్రత్యేక రోప్ పార్టీలను ఏర్పాటు చేయడంతో పాటు పారిశుద్ధ్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు.

భద్రతా పరంగా ఎలాంటి లోపాలు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. నిఘా కోసం ప్రత్యేకంగా డ్రోన్లను ఉపయోగిస్తూ ప్రతి క్షణం పరిస్థితిని సమీక్షిస్తున్నారు. భక్తులందరూ ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరుపుకునేలా అన్ని శాఖల సమన్వయంతో అధికారులు చర్యలు తీసుకున్నారు.

శోభాయాత్ర సాగిందిలా..

బాలాపూర్ గణేష్ శోభాయాత్ర ఎంతో భక్తిశ్రద్ధలతో భక్తుల కోలాహలం నడుమ సాగింది. బాలాపూర్ గణేష్ మండపం ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్ ప్రాంతం నుంచి హుస్సేన్ సాగర్ వరకు మొత్తం 19 కిలోమీటర్లు శోభాయత్ర జరిగింది.  

బాలాపూర్ నుండి ప్రారంభమయ్యే శోభాయాత్ర పాతబస్తీ, సెంట్రల్ హైదరాబాద్‌లోని ప్రధాన ప్రాంతాల మీదుగా సాగింది.  బాలాపూర్ (మండపం)కేశవగిరి , చంద్రాయణగుట్ట , ఫలక్‌నామా , అలీబాద్ , నాగుల్‌చింత, చార్మినార్ , మదీనా, అఫ్జల్‌గంజ్, ఎం.జే. మార్కెట్, అబిడ్స్ , బషీర్‌బాగ్, లిబర్టీ, తెలుగుతల్లి ఫ్లైఓవర్, ఎన్‌టీఆర్ మార్గ్  మీదుగా పీవీఎన్ఆర్ మార్గ్ నుంచి హుస్సేన్ సాగర్ కు చేరుకుంది.  4:36 నిమిషాలకు నిమజ్జనం జరిగింది.

బాలాపూర్ లడ్డూ వేలం:

అంతకు ముందు బాలాపూర్ లడ్డూ వేలం నిర్వహించారు. ఎప్పట్లాగే ఈసారి కూడా గతేడాది రికార్డును అధిగమించింది. వేలంలో లడ్డూ ప్రసాదం 39 లక్షల రూపాయలు పలికింది. గతేడాది 35 లక్షల రూపాయలు పలికిన లడ్డూ ఈ సారి 39 లక్షలు పలకడం విశేషం. లడ్డూ వేలంలో 8 మంది పోటీ పడగా..  సాహెబ్‌నగర్‌కు చెందిన అర్బన్ గ్రూప్ అధినేత సామ ప్రణీత్ రెడ్డి దక్కించుకున్నారు. లడ్డూ తమ చేతికి రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా బాలాపూర్ లడ్డూ వేలం పాటలో పాల్గొంటున్నానని, ఈసారి లడ్డూను దక్కించుకోవడం తనతో పాటు తన కుటుంబ సభ్యులు, అభిమానులకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. 

©️ VIL Media Pvt Ltd.