బంగారం కొనుగోలు చేసేవారికి గుడ్ న్యూస్. ఈ వారంలో గోల్డ్, సిల్వర్ ధరలు భారీగా పడిపోయాయి. త్వరలో పండుగల సీజన్ రానున్న క్రమంలో పసిడి కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు. వచ్చే నెలలో దసరా, ఆ తర్వాతి నెలలో దీపావళి పండుగలు రానున్నాయి. వరుస పండుగల క్రమంలో గోల్డ్ ఎక్కువమంది కొనుగోలు చేస్తుంటారు.
సెప్టెంబర్ 20వ తేదీన హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ధర రూ.1,55,840 వద్ద కొనసాగగా.. సెప్టెంబర్ 26వ తేదీన రూ.1,52,680కి చేరుకుంది. అంటే ఈ వారంలో మొత్తంలో రూ.3160 తగ్గుముఖం పట్టింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు సెప్టెంబర్ 20న రూ.1,42,850గా ఉండగా.. సెప్టెంబర్ 26 నాటికి రూ.1,39,950కి చేరుకుంది. అంటే రూ.2900 మేర తగ్గింది.
వెండి ధరలు కూడా పతనమయ్యాయి. సెప్టెంబర్ 20వ తేదీన హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.2,55,000 వద్ద ఉండగా.. సెప్టెంబర్ 26 నాటికి రూ.2.50 లక్షలకు చేరుకుంది. మొత్తం ఈ వారంలో రూ.5 వేల మేర పడిపోయింది. సిల్వర్ కొనుగోలు చేసేవారికి ఇది పెద్ద ఊరటగా చెప్పవచ్చు.
బంగారం ధరలు తగ్గడానికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో పెట్టుబడిదారులు అధిక వడ్డీ ఇచ్చే బాండ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. బంగారం పెట్టుబడులపై ఎలాంటి వడ్డీ రాదు. దీంతో బాండ్లలో పెట్టుబడులు పెరగడంతో బంగారానికి డిమాండ్ తగ్గింది. ఈ కారణంతో ధరలు తగ్గుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం నడుస్తోంది. దీంతో ముడి చమురు ధరలు తగ్గగా.. బంగారం ధరలు కూడా పడిపోతూ వస్తోన్నాయి. ఇక డాలర్ విలువ కూడా తగ్గడం కూడా గోల్డ్ రేట్లు పతనం కావడానికి కారణమవుతోంది.




