Reading Time: 2 minutes
Kishan Reddy Rahul Gandhi Vote Chori Sir Congress Bjp

ఎన్నికల్లో విజయం సాధిస్తే తమ ఘనతగా చెప్పుకోవడం, ఓటమి ఎదురైతే నిందలన్నీ ఈవీఎంలు , రాజ్యాంగ వ్యవస్థలపై నెట్టడం కాంగ్రెస్ పార్టీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ ఎన్నడూ ఓట్లను చోరీ చేయదని, దేశ ప్రజల మనసులను గెలుచుకుని అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ పాలన, ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ విమర్శలు , ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియపై విపక్షాల వైఖరిని ఎండగట్టారు. సమావేశానికి ముందు భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనోత్సవాలు అత్యంత ప్రశాంతంగా, శోభాయమానంగా పూర్తయినందుకు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితికి, పోలీసులతో పాటు ప్రభుత్వ యంత్రాంగానికి, సహకరించిన నగర ప్రజలకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

ఎన్నికల సంఘంపై ద్వంద్వ వైఖరి..  

కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విజయం సాధించినప్పుడు ఎన్నికల సంఘం వ్యవస్థ అద్భుతంగా పనిచేసిందని పొగిడే కాంగ్రెస్ నాయకులు, ఇతర రాష్ట్రాల్లో బీజేపీ గెలవగానే ఈవీఎంలు తప్పు అనడం వారి రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమని కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌ది కాదని, రాహుల్ గాంధీని ప్రధాని చేయాల్సిన బాధ్యత ఈవీఎంలకు ఉండదని తేల్చిచెప్పారు. 1975లో దేశంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించి, పత్రికా స్వేచ్ఛను హరించి, పౌర హక్కులను కాలరాసిన కాంగ్రెస్‌కు రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజల సమస్యలను గాలికొదిలేసి, ఇతర రాష్ట్రాలకు వెళ్లి సోనియా గాంధీ కుటుంబం కోసం ప్రాణాలు అర్పిస్తానని ప్రకటనలు చేయడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.

వ్యవస్థలపై విదేశాల్లో విషప్రచారం..  

రాహుల్ గాంధీ దేశంలోని ఆర్మీ చీఫ్, ఎయిర్‌ఫోర్స్, సర్జికల్ స్ట్రైక్స్, ఎన్‌ఎస్‌ఏ, లోక్‌సభ స్పీకర్, సీజేఐ, ఈడీ, సీబీఐ , మీడియా వ్యవస్థలపై నిరంతరం అనుమానాలు వ్యక్తం చేస్తూ విదేశీ వేదికలపై దేశ ప్రతిష్టను దిగజారుస్తున్నారని కేంద్ర మంత్రి తీవ్రంగా ఆక్షేపించారు. తమ కుటుంబం మాత్రమే దేశాన్ని పాలించాలనే రాచరికపు అహంకారం రాహుల్ మాటల్లో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. గత 12 ఏళ్ల ప్రధాని మోదీ హయాంలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేకుండా సుపరిపాలన అందిస్తున్నామని, ఉచిత రేషన్, మౌలిక వసతులు, మహిళా సాధికారత ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపామని స్పష్టం చేశారు. పాత యూపీఏ పాలన అంతా కుంభకోణాల మయంగా సాగిందని, అందుకే ప్రజలు స్థిరమైన, సమర్థవంతమైన నాయకత్వాన్ని కోరుకుంటూ బీజేపీని ఆశీర్వదిస్తున్నారని తెలిపారు.

ఓటర్ల జాబితా సవరణపై అనవసర రాద్ధాంతం..  

పశ్చిమ బెంగాల్‌లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియను స్వాగతించాల్సింది పోయి విపక్షాలు రాజకీయ లబ్ధి కోసం విషప్రచారం చేస్తున్నాయని కిషన్ రెడ్డి విమర్శించారు. చనిపోయినవారు, వలస వెళ్లినవారు, చిరునామా లేని లక్షలాది ఓట్లతో పాటు డూప్లికేట్ ఓట్లను తొలగించడం రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అని వివరించారు. ఎన్నికల కమిషనర్ల మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారాన్ని ముగ్గురు కమిషనర్లు నిన్న స్వయంగా సమావేశమై ఖండించారని, దాంతో ఆ అంశం ముగిసిపోయిందని స్పష్టం చేశారు. గత కాంగ్రెస్ హయాంలో దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్లు, మతకలహాలు నిత్యకృత్యంగా ఉండేవని, మోదీ పాలనలో దేశంలోని ఏ ప్రధాన నగరంలోనూ అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణం నెలకొందని చెప్పారు. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్‌లలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి తెచ్చిన కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని ఆయన హెచ్చరించారు.