
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంపై తుది నివేదిక సిద్ధమవుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రమాద దర్యాప్తు ముసాయిదా తుది నివేదికను సమీక్షించే ఏదైనా స్వతంత్ర కమిటీలో తమకు ప్రాతినిధ్యం కల్పించాలని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ కోరింది. దర్యాప్తులో వెలుగుచూసిన కొన్ని సాంకేతిక అంశాలపై భిన్నమైన ఫలితాలు ఉన్నందున వాటిని తుది నివేదిక ఖరారు చేసే ముందు స్వతంత్రంగా పరిశీలించాలని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖను కోరింది.
సెప్టెంబర్ 25న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు పైలట్ల సంఘం లేఖ రాసింది. ప్రభుత్వం లేదా మంత్రిత్వ శాఖ విమాన ప్రమాదంపై తుది ముసాయిదా నివేదికను స్వతంత్రంగా పరిశీలించే అంశాన్ని పరిశీలిస్తోందని తమకు తెలిసిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రొఫెషనల్ పైలట్లకు ప్రాతినిధ్యం వహించే స్వతంత్ర సాంకేతిక భాగస్వామిగా తమను అధికారికంగా నామినేట్ చేయాలని కోరింది. ప్రస్తుతం ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) దర్యాప్తును పూర్తి చేసే దశలో ఉంది. 2026 అక్టోబర్ నాటికి తుది నివేదికను సమర్పించే అవకాశం ఉందని AAIB జూలైలో సుప్రీంకోర్టుకు తెలిపింది. భారత విమాన ప్రమాద దర్యాప్తు నిబంధనలు, ICAO Annex 13 ప్రకారం ఈ దర్యాప్తు కొనసాగుతోంది.
4 సెకన్లా.. 18 సెకన్లా?
విమాన ప్రమాద దర్యాప్తులో అత్యంత కీలకమైన అంశంగా ర్యామ్ ఎయిర్ టర్బైన్ (RAT) వ్యవస్థ పనితీరు, దాని టైమింగ్‌ను పైలట్ల సంఘం ప్రస్తావించింది. విమానానికి ప్రధాన విద్యుత్ శక్తి కోల్పోయినప్పుడు అత్యవసరంగా విద్యుత్‌ను అందించే వ్యవస్థే RAT. AAIB ప్రాథమిక నివేదిక ప్రకారం.. 08:08:42 UTC సమయంలో ఇంధన వ్యవస్థలో అంతరాయం ఏర్పడినట్లు, దాదాపు నాలుగు సెకన్ల తర్వాత RAT ద్వారా హైడ్రాలిక్ పవర్ అందుబాటులోకి వచ్చినట్లు నమోదైంది. అయితే ఆ తర్వాత నిర్వహించిన స్వతంత్ర సిమ్యులేటర్ పరీక్షల్లో భిన్నమైన ఫలితాలు వచ్చాయని పైలట్ సంఘం పేర్కొంది. బహిరంగంగా వెల్లడైన సిమ్యులేటర్ పరీక్షల వివరాలను ఉటంకిస్తూ.. ఇంధన వ్యవస్థలో అంతరాయం ఏర్పడిన తర్వాత RAT ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ అందుబాటులోకి రావడానికి బోయింగ్ 787 సిమ్యులేటర్‌లో సుమారు 18 సెకన్లు పట్టినట్లు తెలిపింది. ఈ నాలుగు సెకన్లు, 18 సెకన్ల మధ్య తేడా ప్రమాదం జరిగిన క్రమాన్ని అర్థం చేసుకోవడంలో కీలకమని FIP అభిప్రాయపడింది.
18 సెకన్ల ఫలితాన్నే అంగీకరించాలనడం లేదు
అయితే 18 సెకన్ల సిమ్యులేటర్ ఫలితాన్నే తుది నిజంగా అంగీకరించాలని FIP ప్రభుత్వాన్ని కోరలేదు. దీనికి బదులుగా AAIB లేదా స్వతంత్ర సమీక్షా వ్యవస్థ ద్వారా ఈ పరీక్షలను మరోసారి నిర్వహించి, రెండు ఫలితాల మధ్య తేడాకు కారణాన్ని గుర్తించాలని కోరింది. ప్రమాదానికి గురైన విమానం, సిమ్యులేటర్‌లో ఉపయోగించిన విమానం, సాఫ్ట్‌వేర్ కాన్ఫిగరేషన్ ఒకేలా ఉన్నాయా? RAT యాక్టివేట్ కావడానికి ఎంత సమయం పడుతుంది? RAT పూర్తిగా పనిచేసి ఉపయోగించగల హైడ్రాలిక్ పవర్ అందించడానికి ఎంత సమయం పడుతుంది? ఇంధన వ్యవస్థలో అంతరాయానికి, RAT యాక్టివేషన్‌కు మధ్య సంబంధం ఏమిటి? వంటి అంశాలను పరిశీలించాలని FIP కోరింది.
టేకాఫ్ టైమింగ్స్‌పైనా ప్రశ్నలు
RAT టైమింగ్‌తో పాటు విమానం టేకాఫ్ సమయంలో నమోదైన పనితీరు టైమింగ్స్‌పైనా పైలట్ల సంఘం సందేహాలు వ్యక్తం చేసింది. ప్రాథమిక నివేదికలో V1 సుమారు 56 సెకన్ల వద్ద, VR సుమారు 58 సెకన్ల వద్ద నమోదైనట్లు పేర్కొంది. అయితే సిమ్యులేటర్ పరీక్షల్లో వీటికంటే తక్కువ సమయాలు నమోదయ్యాయని తెలిపింది. ఈ తేడాలను కేవలం పరిశీలనలుగా నమోదు చేయకుండా సాంకేతికంగా సమీక్షించి, ఎందుకు ఇలా వచ్చిందో స్పష్టంగా నిర్ధారించాలని కోరింది. సంబంధిత టైమింగ్స్‌ను ధృవీకరించేందుకు బోయింగ్ 787పై సమగ్ర సిమ్యులేటర్ పరీక్షలు నిర్వహించాలని తాము గతంలోనే AAIBకి సమర్పించిన అభ్యర్థనల్లో కోరినట్లు పేర్కొంది.
ఎయిరిండియా విమానం 2025 జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన కొద్దిసేపటికే కుప్పకూలింది. బోయింగ్ 787-8 విమానంలో ఉన్న 241 మందితో పాటు హాస్టల్‌లో ఉన్న 19 మంది కలిపి మొత్తం 260 మంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. 2025 జూలైలో AAIB విడుదల చేసిన ప్రాథమిక నివేదిక ప్రకారం.. టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే రెండు ఇంజిన్ల ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లు ‘RUN’ నుంచి ‘CUTOFF’ స్థానానికి మారాయి. దీంతో ఇంజిన్లకు థ్రస్ట్ తగ్గిపోయింది. కాక్‌పిట్‌లో ఒక పైలట్ మరో పైలట్‌ను ఉద్దేశించి ఇంధనాన్ని ఎందుకు కట్ చేశావని ప్రశ్నించినట్లు కూడా నివేదికలో నమోదైంది. అందుకు మరో పైలట్ తాను అలా చేయలేదని సమాధానం ఇచ్చినట్లు పేర్కొంది. అయితే ఈ ప్రాథమిక నివేదిక ప్రమాదానికి తుది కారణాన్ని నిర్ధారించేది కాదని AAIB స్పష్టం చేసింది. దర్యాప్తు ఇంకా ఆధారాల ఆధారంగా కొనసాగుతోందని, తుది నివేదిక వెలువడే వరకు ఎలాంటి తుది నిర్ధారణకు రావద్దని సంస్థ పేర్కొంది.