Reading Time: 2 minutes

సంఘ్ పరివార్ను ఓడించేందుకు ప్రాణత్యాగానికి సిద్ధం: ఆర్యదాన్ ముహమ్మద్ అవార్డు వేడుకల్లో సీఎం రేవంత్

Caption of Image.

ప్రస్తుతం దేశంలో రెండు పరివార్‌ల మధ్య పోరాటం జరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.  ఒకటి సంఘ్ పరివార్, రెండోది గాంధీ పరివార్. సంఘ్ పరివార్ దేశాన్ని మతం, భాష, సంస్కృతి, కులం పేరిట విడగొడుతుంటే.. గాంధీ పరివార్ దేశ ఐక్యత కోసం పోరాడుతోందని అన్నారు. 2026 సెప్టెంబర్ 25వ తేదీన కేరళలో ఆర్యదాన్ ముహమ్మద్ – 2026 బెస్ట్ పబ్లిక్ సర్వెంట్ అవార్డు అందుకున్న సీఎం.. కీలక వ్యాఖ్యలు చేశారు.  

మహాత్మా గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణత్యాగం చేశారని అన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పదవులను త్యాగం చేశారని కొనియాడారు. సంఘ్ పరివార్‌ను ఓడించి దేశాన్ని రక్షించడానికి గాంధీ పరివార్ కోసం తన ప్రాణం కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.

 కేరళలోని నిలంబూరులో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ కే.సీ. వేణుగోపాల్ ఈ అవార్డును సీఎం రేవంత్‌రెడ్డికి ప్రదానం చేశారు. కేరళ దిగ్గజ కాంగ్రెస్ నేత, దివంగత ఆర్యదాన్ ముహమ్మద్ స్మారకార్థం ఆర్యదాన్ ముహమ్మద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ పురస్కారం ఏర్పాటు చేశారు. రైతులు, వెనుకబడిన వర్గాలు, సామాన్య ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వినూత్న కార్యక్రమాలు, దూరదృష్టితో కూడిన నాయకత్వానికి గాను సీఎం రేవంత్‌రెడ్డిని ఈ అవార్డుకు ఎంపిక చేశారని ఫౌండేషన్ వర్కింగ్ చైర్మన్, నిలంబూర్ ఎమ్మెల్యే ఆర్యదాన్ షౌకత్ తెలిపారు. ఈ అవార్డు కింద రూ.లక్ష నగదు, ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందజేశారు. కేరళ వెలుపల నుంచి ఈ పురస్కారానికి ఎంపికైన తొలి వ్యక్తి రేవంత్‌రెడ్డి అని సీఎం గుర్తు చేశారు.

దేశ రాజకీయాలు అర్థం కావాలంటే కేరళ వైపు చూడాలి: 

అవార్డు అందుకున్న తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, ఆర్యదాన్ ముహమ్మద్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ అవార్డును అందుకోవడం నాకు ఎంతో గౌరవంగా ఉంది. కాంగ్రెస్ కార్యకర్తగా, రాహుల్ గాంధీ నాయకత్వంలోని బృందంలో ఒక కార్యకర్తగా ఈ పురస్కారాన్ని స్వీకరిస్తున్నానని అన్నారు.

కేరళ రాజకీయాలు దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తాయని సీఎం అన్నారు. వాతావరణ నిపుణులు రుతుపవనాల కోసం కేరళ వైపు చూసినట్లే, దేశ రాజకీయాలను అర్థం చేసుకోవడానికి కూడా కేరళను సంకేతంగా చూడవచ్చు. 2026లో కేరళలో కాంగ్రెస్ విజయంతో మొదలైన గాలి దేశమంతా తుపానుగా మారాలనిని పిలుపునిచ్చారు.

రాహుల్ గాంధీని భారత ప్రధానమంత్రిగా చూడటమే తన ఏకైక లక్ష్యమని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. నాకు వ్యక్తిగత రాజకీయ ఆశలు లేవు. ఇక నా ముందున్న ఏకైక లక్ష్యం రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడటం అని అన్నారు. ఓటు హక్కును, ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని, మతతత్వ శక్తుల నుంచి దేశాన్ని రక్షించాలని ఆయన పిలుపునిచ్చారు.

©️ VIL Media Pvt Ltd.