
భారతీయ సాంప్రదాయ సౌందర్య సంరక్షణలో పసుపుకు ఉన్న ప్రాముఖ్యత ప్రత్యేకమైనది. పూర్వకాలం నుండి చర్మ సౌందర్యాన్ని పెంపొందించడానికి పసుపును విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. కాగా, ప్రస్తుతం ఫేషియల్ ఐస్ థెరపీ, పసుపులోని గుణాలను కలిపి పసుపు ఐస్ క్యూబ్స్ రూపంలో ఉపయోగించడం బాగా ప్రాచుర్యం పొందింది. ఇది అలసిపోయిన చర్మానికి తక్షణ కాంతిని, నిగారింపును అందిస్తుంది.
చర్మానికి తక్షణ నిగారింపును, తాజాదనాన్ని అందించడానికి పసుపు ఐస్ క్యూబ్స్ అద్భుతమైన సహజ సిద్ధమైన ఉపాయం. పసుపులో ఉండే కుర్కుమిన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ గుణాలు చర్మంపై ఉన్న మచ్చలు, మొటిమలు, ఇన్ఫెక్షన్లను సమర్థవంతంగా నివారిస్తాయి. పసుపుతో ఐస్ థెరపీని ట్రై చేశారంటే..ముఖంపై రక్తప్రసరణ మెరుగై చర్మ రంధ్రాలు బిగుతుగా మారతాయి. పసుపుతో ఐస్ క్యూబ్స్ తయారీ, ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం..
కావలసిన పదార్థాలు:
కస్తూరి పసుపు లేదా సేంద్రీయ పసుపు – 1 స్పూన్
నీరు – 1 గ్లాసు
రోజ్ వాటర్ – 1 టీస్పూన్
అలోవెరా జెల్ – 1 టీస్పూన్
ఐస్ ట్రే
తయారీ విధానం:
ఒక పాత్రలో గ్లాసు నీరు తీసుకుని అందులో 1 స్పూన్ కస్తూరి పసుపు వేసి బాగా కలపండి. చర్మానికి అదనపు తేమ, తాజాదనం కావాలనుకుంటే అందులో కొద్దిగా రోజ్ వాటర్ లేదా అలోవెరా జెల్ కూడా ఉంచవచ్చు.
ఈ మిశ్రమాన్ని ఐస్ ట్రేలో పోసి 4 నుండి 6 గంటల పాటు ఫ్రీజర్‌లో ఉంచండి. గడ్డకట్టిన తర్వాత పసుపు ఐస్ క్యూబ్స్ ఉపయోగించడానికి సిద్ధంగా ఉంటాయి.
ఉపయోగించే సరైన విధానం:
ముందుగా ముఖాన్ని మైల్డ్ ఫేస్ వాష్‌తో శుభ్రంగా కడుక్కోవాలి.
ఐస్ క్యూబ్‌ను నేరుగా చర్మంపై రుద్దడం వల్ల చికాకు రావచ్చు. అందువల్ల, ఒక పలుచని కాటన్ గుడ్డలో పసుపు ఐస్ క్యూబ్‌ను చుట్టుకోవాలి. ముఖం, మెడ భాగంలో 2 నుండి 3 నిమిషాల పాటు వృత్తాకారంలో మృదువుగా మసాజ్ చేయాలి. మసాజ్ పూర్తయ్యాక 5 నిమిషాలు ఉంచి, ఆపై చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. చివరగా మీ క్రమం తప్పకుండా వాడే మాయిశ్చరైజర్ రాసుకోవాలి.
చర్మానికి కలిగే ప్రయోజనాలు:
పసుపులో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాలు మొటిమలకు కారణమయ్యే బాక్టీరియాను నశింపజేస్తాయి. ఐస్ చల్లదనం రక్తప్రసరణను వేగవంతం చేసి ముఖానికి సహజమైన మెరుపును ఇస్తుంది. తెరచుకున్న చర్మ రంధ్రాలను తగ్గించడంలో ఐస్ థెరపీ అద్భుతంగా పనిచేస్తుంది. పసుపులోని కుర్కుమిన్ నల్లటి మచ్చలను, ట్యాన్‌ను క్రమంగా తగ్గిస్తుంది.
జాగ్రత్తలు:
వంటల్లో వాడే సాధారణ పసుపు చర్మంపై పసుపు రంగు మచ్చలను వదలివేయవచ్చు. కాబట్టి, సౌందర్య సంరక్షణకు కస్తూరి పసుపు వాడటం ఉత్తమం. సున్నితమైన చర్మం ఉన్నవారు ముందుగా చేతిపై ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది. వారానికి 2 నుండి 3 సార్లు ఉపయోగించడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు.