
- ఇద్దరు కమిషనర్ల అభ్యంతరాలతో తెరపైకి వివాదం
- రెండు వారాల్లోగా నోటీసులు ఇచ్చేందుకు ఏర్పాట్లు
- రాజ్యాంగ నిపుణులతో కాంగ్రెస్ సంప్రదింపులు
న్యూఢిల్లీ: సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. ఈ ఏడాది మూడోసారి అభిశంసన నోటీసును విపక్షాలు ఇవ్వనున్నాయి. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ మద్దతు కూడగడుతోంది.
ఓవైపు మిత్రపక్షాలతో సంప్రదింపులు చేస్తూ మరోవైపు న్యాయ, రాజ్యాంగ నిపుణులతో చర్చలు జరుపుతోంది. పార్లమెంటు సమావేశాలు లేనప్పుడూ నోటీసు ఇవ్వొచ్చని, వచ్చే వారం లేదా రెండు వారాల్లోగా ఇస్తామని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
అభ్యంతరాలే ఆధారం
ఎస్ఐఆర్ నిర్ణయాలపై ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి 10 నెలల్లో కనీసం 14 సార్లు అధికారికంగా అభ్యంతరాలు నమోదు చేశారని ఈ నెల 23న జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. ఫారం-6 మార్పులు, ఓటర్ల చేర్పులు–తొలగింపులు, ఎలక్టోరల్ రోల్ డేటాబేస్ నియంత్రణపై ఈ అబ్జెక్షన్లు ఉన్నాయి. వీటినే తాజా నోటీసులో చేరుస్తున్నారు. టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా గురువారం సీఈసీపై పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ముచ్చటగా మూడోసారి ప్రయత్నం
మార్చి 12న లోక్‌సభలో 130 మంది ఎంపీలు ఆర్టికల్ 324(5) కింద నోటీసిచ్చారు. ఏప్రిల్ 6న స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ నోటీసులను తిరస్కరించారు. ఏప్రిల్ 24న 73 మంది రాజ్యసభ ఎంపీలు తొమ్మిది అభియోగాలతో ఇచ్చిన నోటీసు పెండింగ్‌లో ఉందని ప్రతిపక్షాలు చెబుతున్నాయి.
అయితే వారిలో ఏడుగురు పార్టీ మారడంతో కొత్త నోటీసు అవసరమైందని తెలిపాయి. కాంగ్రెస్ నేత ప్రమోద్ తివారీ మాట్లాడుతూ, ఆరోపణలకు సీఈసీకి బదులు బీజేపీ నేత సంబిత్ పాత్ర స్పందిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల సంఘం మాత్రం భిన్నాభిప్రాయాలు సాధారణమేనని, తమ ఆదేశాలన్నీ చట్టబద్ధమేనని ప్రకటనలో తెలిపింది.
అభిశంసన ప్రక్రియ ఇలా..
సుప్రీంకోర్టు జడ్జి తొలగింపు తరహాలోనే సీఈసీ అభిశంసన ప్రక్రియ ఉంటుంది. నోటీసుపై 100 మంది లోక్‌సభ ఎంపీలు లేదా 50 మంది రాజ్యసభ సభ్యులు సంతకం చేయాలి. అనుమతించాలా వద్దా అన్నది లోక్ సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ల విచక్షణపై ఆధారపడి ఉంటుంది. ఓటింగ్ దశకు వస్తే ఉభయ సభల్లో మొత్తం సభ్యుల మెజారిటీతో పాటు, హాజరై ఓటేసినవారిలో మూడింట రెండొంతుల మద్దతు అవసరం ఉంటుంది.