కావలసిన పదార్థాలు: 1 కప్పు శుభ్రంగా కడిగి రాత్రంతా నానబెట్టిన సజ్జలు, అర కప్పు బెల్లం తురుము, పావు కప్పు పచ్చికొబ్బరి తురుము, 2 స్పూన్ల గసగసాలు, 1 టేబుల్ స్పూన్ స్వచ్ఛమైన నెయ్యి, పావు టీస్పూన్ యాలకుల పొడి తీపిని బ్యాలెన్స్ చేయడానికి చిటికెడు ఉప్పు, 1 నుండి 2 టేబుల్ స్పూన్ల నీళ్లు కేవలం బెల్లం కరిగించడానికి మాత్రమే, డీప్ ఫ్రైకి సరిపడా నూనె
తయారీ విధానం: ఒక కప్పు సజ్జలను నీటిలో బాగా కడిగి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయం మరోసారి కడిగి, జల్లెడలో వేసి నీటిని పూర్తిగా వడకట్టాలి. ఆ తర్వాత ఒక పొడి కాటన్ బట్టపై పరిచి గాలికి అరగంట పాటు ఆరబెట్టాలి ఎండలో పెట్టకూడదు. కాస్త తడి ఆరిన సజ్జలను మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిని జల్లెడ పట్టి బరకగా ఉన్న పొట్టును తీసేసి, నునుపైన తడి సజ్జపిండిని ఒక వెడల్పాటి తాంబూలంలో పక్కన పెట్టుకోవాలి.
చిన్న పాన్‌లో ఒక స్పూన్ నెయ్యి వేసి 2 స్పూన్ల గసగసాలు, పావు కప్పు పచ్చికొబ్బరి తురుము వేసి పచ్చివాసన పోయేలా 2-3 నిమిషాలు వేయించి పక్కన ఉంచాలి. వేరొక గిన్నెలో అర కప్పు బెల్లం, చిటికెడు ఉప్పు, కేవలం 1-2 స్పూన్ల నీళ్లు పోసి కరిగించాలి పాకం అవసరం లేదు, బెల్లం కరిగి ఒక్క పొంగు వస్తే చాలు.
జల్లించిన సజ్జపిండిలో యాలకుల పొడి, వేయించిన గసగసాలు-కొబ్బరి మిశ్రమం వేసి చేత్తో బాగా కలపాలి. ఇప్పుడు కరిగించిన వేడి బెల్లం నీళ్లను కొద్దికొద్దిగా జల్లెడతో వడకడుతూ పిండిలో పోయాలి. మొదట స్పూన్‌తో, ఆ తర్వాత చేత్తో కలుపుకోవాలి. పిండి జారైపోకుండా చూసుకోవాలి పొరపాటున జారైతే ఒక స్పూన్ పొడి సజ్జపిండి లేదా బియ్యప్పిండి కలుపుకోవచ్చు. పిండి మరీ గట్టిగా కాకుండా మృదువైన ముద్దలా కలుపుకుని మూతపెట్టాలి.
చేతికి నూనె రాసుకుని చిన్న పిండి ముద్దను తీసుకుని.. పాల ప్యాకెట్ కవర్ లేదా అరిటాకుపై పెట్టి పగుళ్లు లేకుండా మీడియం మందంలో గుండ్రంగా అప్పంలా ఒత్తుకోవాలి. బాండీలో నూనెను మీడియం హీట్ చేయాలి. అప్పాన్ని నూనెలో వేసిన వెంటనే మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచాలి. వేసిన 10-15 సెకన్లలోనే పూరీలా చక్కగా పొంగి పైకి తేలుతుంది. వెంటనే రెండో వైపు తిప్పి, నురగలు తగ్గి మంచి రంగు రాగానే జాలి గరిటెతో తీసుకోవాలి. అంతే, నోరూరించే బలవర్ధకమైన సజ్జప్పాలు సిద్ధం! పైన క్రిస్పీగా, లోపల కొబ్బరి-గసగసాల కమ్మదనంతో గుల్లగా ఉండే ఈ స్వీట్ తింటే ఎముకలకు ఎంతో బలం చేకూరుతుంది.




