Reading Time: 2 minutes
Virat Kohli 2019 World Cup Semifinal 2023 Final 2027 Last World Cup

Virat Kohli: 2019 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్‌తో జరిగిన ఆ మ్యాచ్ భారత క్రికెట్ అభిమానులకు ఎంతటి తీరని లోటో, కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి కూడా అంతే పెద్ద దెబ్బ. తాజాగా వెస్టిండీస్‌తో మొదటి వన్డేకు ముందు ‘జియోస్టార్‌’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లీ ఆ చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. “ఆ ఓటమి నన్ను లోపలి నుంచి తీవ్రంగా కలిచివేసింది, నా కెరీర్‌లోనే అది అత్యంత కష్టమైన సమయం” అని విరాట్ తన మనసులోని బాధను బయటపెట్టాడు. ఆ ఓటమిని అంగీకరించడం తనకు చాలా కష్టమైందని, దాని నుంచి కోలుకోవడానికి కొన్ని నెలల సమయం పట్టిందని స్పష్టం చేశాడు.

వర్షం కారణంగా రెండు రోజుల పాటు సాగిన ఆ ఉత్కంఠ పోరులో న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేసి 239/8 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన టీమిండియాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. కివీస్ ఫాస్ట్ బౌలర్ల ధాటికి టాప్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ముగ్గురూ కేవలం ఒక్కో పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ఆ తర్వాత ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజా అద్భుతంగా పోరాడి జట్టును గెలిపించేందుకు ప్రయత్నించినప్పటికీ, భారత్ 221 పరుగులకే ఆలౌటై 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. వర్షం పడి మ్యాచ్ మరుసటి రోజుకి వాయిదా పడటం, ఆ మరుసటి రోజు కొత్త బంతితో కివీస్ బౌలర్లు పిచ్ పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడం భారత్‌కు పెద్ద దెబ్బగా మారిందని కోహ్లీ విశ్లేషించాడు. ఒకవేళ మ్యాచ్ ఆ రోజే పూర్తయి ఉంటే ఫలితం ఇంకోలా ఉండేదేమో అని అభిప్రాయపడ్డాడు.

కోహ్లీ కేవలం 2019 ఓటమి మాత్రమే కాదు, 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన ఘోర పరాజయాన్ని కూడా గుర్తుచేసుకున్నాడు. ఆ ఫైనల్ మ్యాచ్‌లో తాను 54 పరుగుల వద్ద ఉన్నప్పుడు పెద్ద ఇన్నింగ్స్ ఆడుతాననే నమ్మకం ఉండేదని, కానీ అనూహ్యంగా అవుట్ అవ్వడం, ఆ తర్వాత లీగ్ దశ అంతా అద్భుతంగా ఆడి ఫైనల్లో ఓడిపోవడం కొద్దిరోజుల పాటు జీర్ణించుకోలేకపోయానని చెప్పాడు. అయినప్పటికీ, 2023 వరల్డ్ కప్ సమయంలో జట్టులోని ఆటగాళ్ల మధ్య ఉన్న సానుకూల వాతావరణం, ఒకరికొకరు తోడ్పడే మనస్తత్వం చాలా గొప్పగా అనిపించాయని మెచ్చుకున్నాడు.