
సూర్యాపేట, వెలుగు: ఓ ప్రభుత్వ టీచర్ చిట్టీలు, అధిక వడ్డీ పేరుతో పలువురిని నమ్మించి రూ. 7 కోట్లు వసూలు చేసి కనిపించకుండా పోయాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో వెలుగుచూసింది.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం… చివ్వెంల మండలం లక్ష్మీనాయక్ తండా పరిధిలోని ఏనెగంటి తండాకు చెందిన బానోత్ రాజు ఆత్మకూర్(ఎస్) మండలం శెట్టిగూడెం ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తూ సూర్యాపేటలోని 60 ఫీట్ల రోడ్డులో నివాసం ఉంటున్నాడు. టీచర్ గా పనిచేస్తూనే పదేండ్లుగా చిట్టీలు నడిపించడంతో పాటు పలువురి వద్ద నుంచి డబ్బులు తీసుకున్నాడు.
బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ ఇస్తానని చెప్పడంతో రైతులు, ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, పోలీసులతో పాటు వివిధ రంగాల్లో పనిచేసే కార్మికులు రాజుకు డబ్బులు ఇచ్చారు.
ఓ ప్రభుత్వ టీచర్ సుమారు రూ.1.50 కోట్లకు హామీ ఇవ్వడంతో పాటు, మరో రూ.60 లక్షలు వడ్డీకి ఇచ్చినట్లు తెలుస్తోంది. రాజు పది రోజులుగా కనిపించకపోవడం, ఫోన్ చేసినా స్పందించకపోవడంతో డబ్బులు ఇచ్చిన వారు ఆయన ఇంటికి వెళ్లి చూడగా.. తాళం వేసి కనిపించింది.
కుటుంబ సభ్యులు సైతం అందుబాటులో లేకపోవడంతో మోసపోయినట్లు గ్రహించి చివ్వెంల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం సూర్యాపేట ఎస్పీ నర్సింహను కలిశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, రాజు కోసం గాలిస్తున్నట్లు చివ్వెంల ఎస్సై మహేశ్ తెలిపారు.