Reading Time: 2 minutes
Hyderabad Ganesh Immersion 2026 Tank Bund Traffic Restrictions

Hyderabad: హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌కు నలువైపుల నుంచి పెద్ద ఎత్తున వినాయక విగ్రహాలు చేరుకుంటున్నాయి. ప్రస్తుతం గణేశ్ నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా కొనసాగుతోంది. వేలాది మంది భక్తులు తరలిరావడంతో నిమజ్జన ప్రక్రియకు స్వల్ప ఆలస్యం జరుగుతుండగా, శోభాయాత్ర మధ్యాహ్నం వరకు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రక్రియను వీలైనంత త్వరితగతిన పూర్తి చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే.. నిమజ్జనం నేపథ్యంలో శోభాయాత్ర సాగే ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలను నేడు కూడా కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్, పీవీ స్టాచ్యూ, ఇందిరాగాంధీ రోటరీ పరిసరాల్లో విగ్రహాల రద్దీ కారణంగా సాధారణ వాహనాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జన శోభాయాత్ర నిన్నటి నుంచి ఎంతో ప్రశాంత వాతావరణంలో, వైభవంగా కొనసాగుతోందని నగర పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సహకరిస్తున్న ప్రజలందరికీ ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, లిబర్టీ, మోజంజాహీ మార్కెట్ తదితర ప్రాంతాలకు కుటుంబ సమేతంగా లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో వాహనాల రాకపోకలు మందగించి, నిమజ్జన ప్రక్రియ కాస్త ఆలస్యమైందని పేర్కొన్నారు. ఈ శోభాయాత్ర నేటి మధ్యాహ్నం వరకు కూడా కొనసాగే అవకాశం ఉన్నందున, విగ్రహాల నిమజ్జనాన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి పోలీస్‌, ట్రాఫిక్‌ విభాగాల సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో శోభాయాత్ర సాగే ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలను నేడు కూడా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్, పీవీ స్టాచ్యూ, ఇందిరాగాంధీ రోటరీ పరిసరాల్లో విగ్రహాల రద్దీ కారణంగా సాధారణ వాహనాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అత్యవసరమైతే తప్ప సాధారణ వాహనదారులు ఈ మార్గాల్లో రాకపోకలను పూర్తిగా నివారించి, ప్రయాణాలను వాయిదా వేసుకోవడమో లేదా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడమో చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అనవసరంగా రహదారులపైకి వచ్చి ట్రాఫిక్‌లో చిక్కుకుని ఇబ్బందులు పడవద్దని సూచించారు. ట్రాఫిక్ విభాగం ఎప్పటికప్పుడు జారీ చేసే అధికారిక సూచనలు, అడ్వైజరీలను గమనిస్తూ నగర ప్రజలంతా పోలీసు యంత్రాంగానికి పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు.

ఇక, ఇప్పటికే హుస్సేన్ సాగర్‌లో వేలాది వినాయక విగ్రహాల నిమజ్జనం పూర్తయ్యాయి. ప్రతి విగ్రహంతో పాటు పదుల సంఖ్యలో భక్తులు, మండపాల నిర్వాహకులు ఊరేగింపుగా తరలివస్తున్నారు. విగ్రహాలు మోసుకొచ్చే ప్రతి వాహనం నుంచి బ్లోయర్స్ ద్వారా రంగు రంగుల పేపర్లను గాల్లోకి ఎగరవేస్తుండటంతో.. ట్యాంక్ బండ్, NTR మార్గ్ రోడ్లపై కొన్ని టన్నుల కొద్దీ చెత్త పేరుకుపోయింది. రోడ్లపై విపరీతంగా పేరుకుపోయిన చెత్త చెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలను జిహెచ్ఎంసి (GHMC) కార్మికులు ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. గత 13 రోజులుగా నిమజ్జన సమయంలో ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు, NTR మార్గ్ రోడ్లపై పడుతున్న వ్యర్థాలను జిహెచ్ఎంసి సిబ్బంది నిరంతరం శుభ్రం చేస్తూ పరిశుభ్రతను కాపాడుతున్నారు.