
India vs Japan: జపాన్‌తో జరిగిన ఏకైక టీ20 మ్యాచ్‌లో భారత్ 2 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించినప్పటికీ, మ్యాచ్ తర్వాత సోషల్ మీడియాలో తీవ్ర దుమారం చెలరేగింది. జపాన్ ఇన్నింగ్స్ సమయంలో ఒక కీలకమైన వైడ్ నిర్ణయాన్ని అంపైర్ వెనక్కి తీసుకోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇండియన్ టీమ్ ఒత్తిడి చేయడంతో అంపైర్ నిర్ణయం మార్చారంటూ నెటిజన్లు చీటింగ్ అంటూ ఆరోపణలు చేశారు. కానీ, ఈ వివాదంపై స్పందించిన భారత మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా అంపైర్లు తీసుకున్న నిర్ణయం ఐసీసీ రూల్స్ ప్రకారం సరైనదని తేల్చి చెప్పారు.
అసలు మ్యాచ్‌లో ఏం జరిగింది:
మ్యాచ్ చివరి ఓవర్‌లో అక్షర్ పటేల్ లెగ్-స్టంప్ పైకి బంతిని విసరగా, లెఫ్ట్ హ్యాండర్ అలెగ్జాండర్ శిరాయ్-పాట్‌మోర్ రివర్స్-స్వీప్ ఆడే ప్రయత్నం చేశాడు. మొదట ఆ బంతిని అంపైర్ వైడ్‌గా ప్రకటించినప్పటికీ, ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ప్రస్తుత ఐసీసీ రూల్స్ ప్రకారం.. బ్యాటర్ రివర్స్-స్వీప్ షాట్ ఆడటానికి ప్రయత్నించినప్పుడు ఆఫ్-సైడ్ వైడ్ మార్గదర్శకాలు వర్తిస్తాయి. ఈ కారణంగానే ఆ బంతిని వైడ్‌గా పరిగణించలేదు. ఈ నిర్ణయం భారత్‌కు అనుకూలంగా మారడంతో, జపాన్ గెలవడానికి 4 బంతుల్లో 5 పరుగుల నుంచి 3 బంతుల్లో 6 పరుగులుగా మారింది.
ఆకాశ్ చోప్రా ఏం క్లారిటీ ఇచ్చాడంటే:
తన యూట్యూబ్ ఛానెల్‌లో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ఈ నిర్ణయం వెనుక ఉన్న నిబంధనలు, ఆలోచనా విధానాన్ని వివరంగా వెల్లడించారు. భారత్ మోసం చేసి జపాన్‌ను ఓడించిందని కొందరు అంటున్నారు. వైడ్ నిర్ణయాన్ని మార్చడంతో ఈ విమర్శలు వస్తున్నాయి, జనం కేవలం గందరగోళాన్ని సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. తొలుత నా అవగాహన కూడా తప్పే.. స్విచ్-హిట్ ఆడినప్పుడు మాత్రమే బౌలర్‌కు వైడ్ రూల్స్ వర్తిస్తాయని, రివర్స్-స్వీప్ ఆడినప్పుడు కాదని నేను భావించానని ఆయన తెలిపారు. నిబంధనలను పరిశీలించిన తర్వాత నాది కూడా పొరపాటు అని తేలిందని ఆకాశ్ ఒప్పుకున్నాడు.
కొత్త ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయి:
నేను నిబంధనలను క్షుణ్ణంగా పరిశీలించి, అంపైర్ల వాదనను విన్నాను.. కొత్త ఐసీసీ నిబంధనల ప్రకారం.. స్విచ్-హిట్, రివర్స్-స్వీప్ మధ్య ఎలాంటి తేడా చూపించరని ఆకాశ్ చోప్రా స్పష్టం చేశారు. ఈ రెండు షాట్లను వారు ఒకే కోణంలో చూస్తారు.. అంతేకాకుండా, బౌలర్ బంతిని చేతిలో పట్టుకున్నా లేదా రిలీజ్ చేసినా సరే, బ్యాటర్ తన పొజిషన్‌ను ఎప్పుడు మార్చినా అది అతను స్థానం మార్చుకున్నట్లుగానే పరిగణించబడుతుంది.. దీనివల్ల ప్రయోజనం (benefit of the doubt) బౌలర్‌కే దక్కుతుంది. రూల్స్ ప్రకారం బ్యాటర్ ఏకకాలంలో లెఫ్ట్-హ్యాండర్, రైట్-హ్యాండర్ కింద లెక్కలోకి వస్తాడని చోప్రా వివరించారు.