
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో సీఎన్జీ కార్లకు డిమాండ్ రోజురోజుకూ విపరీతంగా పెరుగుతోంది. గతేడాది ఆగస్టు, 2026 నాటి అమ్మకాలను పరిశీలిస్తే.. మారుతి ఎర్టిగా 13,000 యూనిట్లకు పైగా అమ్ముడై అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. మరోవైపు.. దేశంలోనే అత్యంత చవకైన సీఎన్జీ కారుగా పేరున్న మారుతి సుజుకి ఎస్-ప్రెస్సోకు మాత్రం నిరాశ ఎదురైంది. గత నెలలో ఈ కారు సీఎన్జీ మోడల్‌ను ఒక్కరు కూడా కొనుగోలు చేయకపోవడం విశేషం. సరిగ్గా ఏడాది క్రితం ఇదే సమయంలో ఎస్-ప్రెస్సో సీఎన్జీని 92 మంది కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ కారు ప్రత్యేకతలు, ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం.
మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో తన ప్రత్యేకమైన మైక్రో-ఎస్‌యూవీ లుక్, ఎత్తైన డిజైన్‌కు ప్రసిద్ధి చెందింది. దీని బాక్సీ డిజైన్, బోల్డ్ గ్రిల్, మంచి గ్రౌండ్ క్లియరెన్స్ కారణంగా ఇది రఫ్-అండ్-టఫ్ అనుభూతిని ఇస్తుంది. ఇంటీరియర్‌లో మినీ కూపర్ వంటి సర్క్యులర్ సెంటర్ కన్సోల్, డిజిటల్ స్పీడోమీటర్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేకు మద్దతు ఇచ్చే 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి.
భద్రత విషయానికి వస్తే.. ఇందులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్‌తో కూడిన ఈబీడీ, రియర్ పార్కింగ్ సెన్సార్లు, స్పీడ్ అలర్ట్ సిస్టమ్ వంటి ప్రామాణిక ఫీచర్లు ఉన్నాయి. కొత్త యూనిట్లలో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్లను కూడా చేర్చారు.
ఇక పనితీరు విషయానికి వస్తే.. ఇందులో 1.0 లీటర్ కే10సీ పెట్రోల్ ఇంజిన్ అమర్చారు. ఇది పెట్రోల్ మోడ్‌లో 66 బీహెచ్‌పీ పవర్, 89 ఎన్ఎం టార్క్‌ను, అలాగే సీఎన్జీ మోడ్‌లో 57 బీహెచ్‌పీ పవర్, 82.1 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు పెట్రోల్‌పై లీటరుకు సుమారు 24 నుంచి 25 కి.మీ, సీఎన్జీపై కిలోకు దాదాపు 32.73 కి.మీ మైలేజ్ ఇస్తుంది. భారత మార్కెట్లో ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 3.49 లక్షల నుంచి రూ. 5.25 లక్షల వరకు ఉంటుంది. ఇంత తక్కువ ధర, అద్భుతమైన మైలేజ్ ఉన్నప్పటికీ ఆగస్టు నెలలో ఒక్క సీఎన్జీ కారు కూడా అమ్ముడుపోకపోవడం గమనార్హం.