
తెలంగాణలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత ఆధునీకరించేందుకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 13 ప్రాంతాల్లో ఆధునిక వసతులతో కూడిన నూతన బస్టాండ్లను నిర్మించనున్నట్లు ప్రకటించింది. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు, వాణిజ్య కార్యకలాపాలకు పెద్దపీట వేయడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం.
నాగర్‌కర్నూల్, రేగొండ, హుజూర్‌నగర్, కోదాడ, కొడంగల్, కోస్గి, మద్దూరు, కేసముద్రం, హుస్నాబాద్, ములుగు, మధిర, నల్గొండ, కొత్తగూడెం ప్రాంతాల్లో ఈ బస్టాండ్లు రానున్నాయి. ప్రయాణ సమయాల్లో వేచి ఉండే ప్రయాణికుల కోసం వెయిటింగ్ హాళ్లు, ఆహారం, షాపింగ్ అన్నీ ఒకే చోట లభించేలా ఫుడ్ కోర్టులు, బిజినెస్ కాంప్లెక్స్‌లు, వినోద కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా కొడంగల్, మద్దూరు, కోస్గి, హుస్నాబాద్ ప్రాంతాలలో ఇప్పటికే నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కొడంగల్‌లో 1.91 ఎకరాల స్థలంలో రూ.15.82 కోట్లతో (మొదటి ఆప్షన్) లేదా రూ.11.53 కోట్లతో (రెండో ఆప్షన్) నిర్మాణాలు చేపట్టనున్నారు. కోస్గిలో 1.55 ఎకరాల్లో రూ.15.08 కోట్లు లేదా రూ.9.60 కోట్లతో, మద్దూరులో 1.05 ఎకరాల్లో రూ.7.60 కోట్లు లేదా రూ.4.48 కోట్ల అంచనా వ్యయాలతో ప్రణాళికలు సిద్ధం చేశారు. షాపులు, వ్యాపార సముదాయాల కేటాయింపులపై ఆసక్తి ఉన్న వ్యాపారులు ఆర్టీసీ యాజమాన్యాన్ని సంప్రదించవచ్చని తెలిపారు.
ఈ ఆధునిక బస్టాండ్లు ప్రయాణ కేంద్రాలుగానే కాకుండా గ్రామీణ ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి తోడ్పడనున్నాయి. బస్టాండ్లలో ఏర్పాటు చేసే దుకాణాలు, ఫుడ్ కోర్టుల ద్వారా స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు, చిన్న వ్యాపారులకు, స్థానిక ఉత్పత్తులు విక్రయించే వారికి నూతన మార్కెట్ లభిస్తుంది. మొత్తంగా ఈ బస్టాండ్లు రవాణా, వాణిజ్యం, స్థానిక ఉపాధిని సమర్థవంతంగా అనుసంధానించే కేంద్రాలుగా అభివృద్ధి చెందనున్నాయి.