కావలసిన పదార్థాలు: 1 కప్పు లావు అటుకులు, 1 కప్పు బొంబాయి రవ్వ , అర కప్పు పెరుగు, గోధుమ పిండి లేదా మైదా – 2 టేబుల్ స్పూన్లు, అర టీస్పూన్ పంచదార, రుచికి సరిపడా ఉప్పు, దోశలు కాల్చడానికి కొద్దిగా నూనె. ఘాటైన పల్లీ చట్నీ కోసం: అర కప్పు వేరుశనగ గుళ్లు, 4-5 పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు, తాలింపు దినుసులు.
తయారీ విధానం: ఒక బౌల్లో ఒక కప్పు లావు అటుకులను తీసుకుని రెండు సార్లు నీళ్లతో శుభ్రంగా కడిగి నీటిని పూర్తిగా ఒంపేయాలి. మూతపెట్టి 15 నిమిషాలు ఉంచితే అటుకుల్లోని సహజ తేమతో అవి మెత్తగా నానుతాయి. ఆ తర్వాత అందులో ఒక కప్పు సూజీ రవ్వ, కొద్దికొద్దిగా పెరుగు పోసి బాగా కలిపి మరో 5 నుండి 10 నిమిషాలు పక్కన ఉంచాలి.
బాండీలో పల్లీలను దోరగా వేయించి పక్కకు తీసుకోవాలి. అదే బాండీలో కొద్దిగా నూనె వేసి పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, కొత్తిమీర వేసి పచ్చివాసన పోయేలా వేయించాలి. మిక్సీ జార్లో వేయించిన పల్లీలు, పచ్చిమిర్చి మిశ్రమం, జీలకర్ర, సరిపడా ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. నూనెలో ఆవాలు, జీలకర్ర, కరివేపాకుతో తాలింపు వేసి చట్నీని రెండు నిమిషాలు ఉడికిస్తే కమ్మటి చట్నీ రెడీ అవుతుంది.
నానిన అటుకులు-రవ్వ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులో సరిపడా ఉప్పు, మంచి కలర్ కోసం అర టీస్పూన్ పంచదార, పెనానికి అంటుకోకుండా ఉండటం కోసం 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి లేదా మైదా వేసి మెత్తటి నునుపైన దోశ పిండిలా గ్రైండ్ చేయాలి. పిండి గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్లు కలుపుకోవాలి.
స్టవ్ వెలిగించి పాన్ లేదా కడాయి పెట్టి కొద్దిగా నూనె చిలకరించాలి. పెనం వేడయ్యాక ఒక గరిటెడు పిండిని వేసి చిన్న పాన్కేక్ లేదా ఆప్పంలా కాస్త మందంగా రౌండ్గా వేయాలి. మీడియం మంటపై రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు కాల్చి ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, కేవలం 10 నిమిషాల్లో దూదిలాంటి అటుకుల దోశలు సిద్ధం! ఘుమఘుమలాడే పల్లీ చట్నీతో వేడివేడిగా తింటే నోట్లో ఇట్టే కరిగిపోతాయి




