Reading Time: 2 minutes

అక్టోబర్ 2న “No UPI Day” .. వ్యాపార సంఘాల తిరుగుబాటు: షాపుల్లో క్యూఆర్ కోడ్స్ పనిచేయవు!

Caption of Image.

UPI లావాదేవీలపై MDR ఛార్జీలు విధిస్తూ  మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రతిపాదనకు వ్యతిరేకంగా వ్యాపార సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇందులో భాగంగా అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా “నో యూపీఐ డే” పాటించాలని నిర్ణయించాయి. నిరసనలో భాగంగా వ్యాపారులు తమ క్యూఆర్ కోడ్ స్కానర్లు, పేమెంట్ సౌండ్ బాక్స్‌లకు నల్లటి బట్టలు కప్పి తమ నిరసనను తెలపనున్నారు. మహారాష్ట్ర చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ అండ్ అగ్రికల్చర్ ఈ నిరసనకు పిలుపునిచ్చింది.

అక్టోబర్ 15 నుంచి కొత్త ఛార్జీలు..
మోడీ సర్కార్ నిర్ణయం ప్రకారం అక్టోబర్ 15 నుంచి వ్యాపారులు రూ. 2వేల కంటే ఎక్కువ విలువైన యూపీఐ చెల్లింపులు స్వీకరించినప్పుడు 0.4 శాతం ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి గరిష్టంగా ట్రాన్సాక్షన్ పై రూ.300గా కేంద్రం నిర్ణయించింది. అయితే వ్యక్తుల మధ్య జరిగే పేమెంట్స్, రూ.2వేల లోపు విలువైన మర్చంట్ లావాదేవీలు యథావిధిగా ఉచితంగానే కొనసాగనున్నాయి. అలాగే నెలకు రూ.లక్ష వరకు ఆదాయం పొందే చిన్న చిన్న చిరు వ్యాపారుల లావాదేవీలను ‘పర్సన్-టు-పర్సన్-మర్చంట్’ కింద మినహాయించారు.

వ్యాపారుల ఆవేదన..
తక్కువ మార్జిన్లతో వ్యాపారం చేసే తమపై కొత్త యూపీఐ చార్జీలు ఆర్థిక భారాన్ని మోపుతాయని వ్యాపారులు వాపోతున్నారు. డిజిటల్ చెల్లింపుల వృద్ధికి రిటైలర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఎంతో సహకరిస్తుంటే.. ఇప్పుడు వ్యాపారులపైనే అదనపు భారం ఎందుకు మోపాలని AICPDF అధ్యక్షుడు ధైర్యశిల్ పాటిల్ ప్రశ్నించారు. డిజిటల్ లావాదేవీల వల్ల పూర్తి పారదర్శకత ఉంటుందని, అయితే ఛార్జీల పేరుతో తమను శిక్షించడం సరికాదని ఎడిబుల్ ఆయిల్ ట్రేడర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు శంకర్ థక్కర్ ఆందోళన వ్యక్తం చేశారు.

ALSO READ : ట్రంప్‎కు బిగ్ షాక్

పెట్రోల్ డీలర్లు, స్టాక్ బ్రోకర్ల డిమాండ్లు..
యూపీఐ ఛార్జీల నుంచి తమకు కూడా మినహాయింపు ఇవ్వాలని పెట్రోల్ డీలర్లు డిమాండ్ చేస్తున్నారు. పెట్రోలియం మంత్రిత్వ శాఖ అధికారులు ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్‌తో భేటీ అయి చర్చలు జరిపారు. మరోవైపు క్యాపిటల్ మార్కెట్ లావాదేవీలపై 0.02 శాతం ఎండీఆర్ విధించడంపై స్టాక్ బ్రోకర్లు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ డిమాండ్లను పరిశీలిస్తామని సెబీ ఛైర్మన్ తుహిన్ కాంతా పాండే తెలిపారు. అక్టోబర్ 15లోగా ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న యూపీఐ ఛార్జీలను ఉపసంహరించుకోకపోతే భవిష్యత్తులో మరింత ఉధృతమైన నిరసనలు చేపడతామని ట్రేడర్ యూనియన్లు హెచ్చరిస్తున్నాయి.

©️ VIL Media Pvt Ltd.