Reading Time: 2 minutes
బంగారం కొంటున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి… లేదంటే నష్టపోవడం ఖాయం!

భారతీయ సంస్కృతిలో బంగారానికి ఉన్న ప్రాధాన్యత ప్రత్యేకమైనది. పండుగలు, వివాహాలు, శుభకార్యాల సమయంలో జనాలు భారీగా పసిడి కొనుగోలు చేస్తుంటారు. చాలామంది బంగారాన్ని అత్యవసర సమయాల్లో ఉపయోగపడే సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు. అయితే, జ్యువెలరీ షాపుకు వెళ్లి బంగారం కొనేటప్పుడు కొన్ని ప్రాథమిక విషయాలు తెలియకపోతే వ్యాపారులు చెప్పిన ధరకు మోసపోయే అవకాశం ఉంది. కొనుగోలుదారులు సాధారణంగా చేసే పొరపాట్లు, వాటిని అధిగమించే మార్గాలు ఇక్కడ చూడండి.

హాల్‌మార్కింగ్ చూడకపోవడం-

బంగారం స్వచ్ఛతకు నిదర్శనం బిఐఎస్ హాల్‌మార్క్. బంగారం కొనేటప్పుడు దానిపై హాల్‌మార్క్ ముద్రతో పాటు 6 అంకెల HUID (Hallmark Unique Identification) నంబర్ ఉందో లేదో తప్పనిసరిగా తనిఖీ చేయాలి. ఈ కోడ్ ఉంటేనే ఆ బంగారం స్వచ్ఛమైనదని అర్థం. BIS Care App ద్వారా ఈ నంబర్‌ను ఉచితంగా వెరిఫై చేసుకోవచ్చు.

క్యారెట్ వ్యత్యాసం గమనించకపోవడం-

ఆర్నమెంట్ గోల్డ్ సాధారణంగా 22 క్యారెట్లు (22K) లేదా 18 క్యారెట్లలో (18K) ఉంటుంది. 24 క్యారెట్ల బంగారం బిస్కట్లు, కాయిన్ల రూపంలోనే లభిస్తుంది. షాపు యజమానులు 24K ధరను లెక్కించి, మీకు 22K లేదా 18K ఆభరణాలు ఇస్తున్నారేమో సరిచూసుకోవాలి. కొనుగోలు చేసే ఆభరణం ఏ క్యారెట్‌కు చెందినదో బిల్‌లో స్పష్టంగా ఉందో లేదో చూడాలి.

మేకింగ్ ఛార్జీలు, తరుగు –

ఆభరణాల తయారీకి జివెలర్లు మేకింగ్ ఛార్జీలు, తరుగు పేరుతో కొంత శాతం అదనంగా వసూలు చేస్తారు. ఇది ఒక్కో షాపులో ఒక్కోలా (8శాతం నుండి 25శాతం వరకు) ఉంటుంది. కొనుగోలు చేసే ముందు వివిధ షాపుల్లో మేకింగ్ చార్జీలను పోల్చి చూసుకోవడం మంచిది. అలాగే ఈ ఛార్జీలను తగ్గించమని బేరం ఆడటం మరచిపోవద్దు.

రాళ్లు, రత్నాల బరువు-

రాళ్లు, ముత్యాలు లేదా డైమండ్స్ ఉన్న బంగారు ఆభరణాలు కొనేటప్పుడు, మొత్తం బరువులో నుంచి రాళ్ల బరువును మినహాయించి కేవలం బంగారానికి మాత్రమే ధర చెల్లించాలి. తిరిగేటప్పుడు లేదా అమ్మేటప్పుడు రాళ్ల విలువను జ్యువెలర్లు పరిగణనలోకి తీసుకోరు.

పక్కా బిల్లు తీసుకోకపోవడం-

బంగారం కొనుగోలు చేసిన తర్వాత GST, బంగారపు బరువు, క్యారెట్, అప్పటి రేటు, మేకింగ్ ఛార్జీలు స్పష్టంగా నమోదైన పక్కా బిల్లు తప్పకుండా తీసుకోవాలి. రేపు ఆభరణం అమ్మాలన్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలన్నా ఈ బిల్లే ప్రామాణికం. గోల్డ్ రేట్లు రోజురోజుకూ మారుతున్న తరుణంలో, పైన తెలిపిన జాగ్రత్తలు పాటిస్తే మీ సొమ్ముకు సరైన న్యాయం జరుగుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.