Reading Time: 2 minutes
Yamuna Expressway Bus Fire 9 Dead After Sleeper Bus Catches Fire In Greater Noida

Yamuna Expressway Bus Fire: ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణిస్తున్న స్లీపర్ బస్సులో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 9 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం యమునా ఎక్స్‌ప్రెస్‌వే జీరో పాయింట్ నుంచి సుమారు 32 కిలోమీటర్ల దూరంలో, జేవర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బుధవారం-గురువారం అర్ధరాత్రి సమయంలో సుమారు 11:30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.

40 నుంచి 50 మంది ప్రయాణికులు

జాయింట్ సీపీ రాజీవ్ నారాయణ్ మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 నుంచి 50 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. మంటల నుంచి తప్పించుకునేందుకు కొందరు ప్రయాణికులు బస్సు నుంచి కిందకు దూకినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 9 మంది ప్రాణాలు కోల్పోయారు.

పూర్తిగా దగ్ధమైన బస్సు

మంటలు వేగంగా వ్యాపించడంతో కొద్దిసేపట్లోనే బస్సు మొత్తం మంటల్లో చిక్కుకుంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో మరికొందరు ప్రయాణికులు బస్సులోనే చిక్కుకుపోయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. రెస్క్యూ ఆపరేషన్ పూర్తయిన తర్వాతే బస్సులో ఇంకా ఎవరైనా ఉన్నారా? ఎంతమంది ప్రమాదానికి గురయ్యారు? అనే విషయాలు స్పష్టమవుతాయని అగ్నిమాపక అధికారులు తెలిపారు. పోలీసులు, స్థానిక అధికారులు సంఘటనా స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

ఘటనపై సీఎం యోగి ఆరా

గ్రేటర్ నోయిడా బస్సు అగ్నిప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఘటనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఢిల్లీ నుంచి మహోబాకు వెళ్తున్న బస్సు

ప్రమాదానికి గురైన బస్సు రాజ్ కల్పనా ట్రావెల్స్‌కు చెందిన BR32 PA8647గా గుర్తించారు. ఈ బస్సు ఢిల్లీ నుంచి మహోబాకు వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ట్రావెల్స్‌కు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో ఎక్కువగా సర్వీసులు ఉన్నట్లు సమాచారం.

అగ్నిప్రమాదానికి కారణం ఏంటి?

ప్రస్తుతం బస్సులో మంటలు ఎలా చెలరేగాయనే విషయం స్పష్టంగా తెలియలేదు. ప్రమాదానికి గల కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బస్సులోని ప్రయాణికులను విచారించి ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు. ప్రస్తుతం పోలీసు, అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటనా స్థలంలోనే ఉండి సహాయక చర్యలు, దర్యాప్తును కొనసాగిస్తున్నారు. అగ్నిప్రమాదానికి ఖచ్చితమైన కారణం దర్యాప్తు పూర్తయిన తర్వాత వెల్లడయ్యే అవకాశం ఉంది.