
- సింగరేణిలో 14 బ్లాకులు బంద్ చేసి వేలానికి వెళ్లలే
- గత సర్కారు తీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం
- మహానది కోల్ ఫీల్డ్స్, కోల్ ఇండియా నుంచి
- తక్షణమే జీ-–9 బొగ్గు కొనాలన్న ముఖ్యమంత్రి
- దసరాలోపు పూర్తి ఉత్పత్తి చేయాలని ఆదేశం
- రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉండొద్దన్న సీఎం
- కరెంటు ఆఫీసర్లతో సీఎం, డిప్యూటీ సీఎం సమీక్ష
హైదరాబాద్, వెలుగు: సింగరేణిలో అసలు లభ్యతే లేని ‘జీ9’ గ్రేడ్ బొగ్గు ఆధారిత టెక్నాలజీతో యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఎందుకు నిర్మించారని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ప్రశ్నించారు. బుధవారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. యాదాద్రి థర్మల్ ప్లాంట్‌లో పూర్తిస్థాయి ఉత్పత్తి జరగకపోవడంపై అధికారులను ఆరా తీశారు.
నిర్దేశిత సామర్థ్యం మేరకు విద్యుదుత్పత్తి చేయాలంటే ‘జీ-9’ గ్రేడ్ బొగ్గు మాత్రమే అవసరమని అధికారులు వివరణ ఇచ్చారు. సింగరేణి కాలరీస్ పరిధిలో ప్రస్తుతం జీ-9 రకం బొగ్గును వెలికితీసే బ్లాకులు ఏవీ లేవన్నారు. సమీప భవిష్యత్తులో కూడా సింగరేణి నుంచి జీ-9 బొగ్గు ఉత్పత్తి అయ్యే అవకాశాలు లేవన్నారు.
దీనిపై స్పందించిన సీఎం, డిప్యూటీ సీఎం.. సింగరేణిలో బొగ్గు లభ్యత లేనప్పుడు, కనీసం భవిష్యత్తులోనూ లభ్యమయ్యే అవకాశం లేనప్పుడు అదే సాంకేతిక పరిజ్ఞానంతో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను అలా ఎందుకు డిజైన్ చేసి నిర్మించారని అధికారులను ప్రశ్నించారు. ముందస్తు ప్రణాళిక లేకుండా, ఇంధన లభ్యత సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయకుండా ప్రాజెక్టును ఎలా చేపట్టారంటూ ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న విద్యుత్ అవసరాలు, పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని సింగరేణిలో జీ9 బొగ్గు లభ్యత లేనందున విద్యుత్ ఉత్పత్తి ఆగిపోకుండా మహానది కోల్ ఫీల్డ్స్, కోల్ ఇండియా నుంచి తక్షణమే బొగ్గు కొనుగోలుకు చర్యలు ప్రారంభించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. రాష్ట్రానికి అవసరమైన బొగ్గు కేటాయింపులపై తక్షణమే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డితో చర్చలు జరపాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు సూచించారు.
ఉత్పత్తి విషయంలో ఇకపై ఎలాంటి సాకులు వెతకడానికి వీల్లేదని, రాబోయే దసరా పండుగ నాటికి యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తిని సాధించి తీరాల్సిందేనని సీఎం ఆదేశించారు. అన్ని విభాగాలు సమన్వయంతో పని చేసి ప్లాంట్‌ను పూర్తి సామర్థ్యంతో నడపాలని తేల్చిచెప్పారు. కరెంట్ కోతలు పెట్టడానికి వీల్లేదని, విద్యుత్ కొరత రాకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.
రూ. 40 వేల కోట్ల అదనపు భారం..
యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణ స్థలం ఎంపికలో జరిగిన భారీ వ్యూహాత్మక తప్పిదాన్ని కూడా సీఎం ఎండగట్టారు. థర్మల్ ప్రాజెక్టుల విషయంలో సాధారణంగా పాటించే పిట్ హెడ్ (బొగ్గు గనుల సమీపంలోనే విద్యుత్ కేంద్రం నిర్మించడం) విధానాన్ని పక్కనపెట్టి, గనులకు అంత సుదూర ప్రాంతంలో యాదాద్రి కేంద్రా న్ని ఎందుకు నిర్మించాల్సి వచ్చిందో చెప్పాలని అధికారులను ప్రశ్నించారు. గనులకు దూరంగా కట్టడం వల్ల నిరంతరం బొగ్గు రవాణా చేయాల్సి వస్తోందని, తద్వారా రాష్ట్ర ఖజానాపై పడుతున్న అదనపు భారం ఎంత అని లెక్కలు తీశారు.
దీనికి అధికారులు బదులి స్తూ.. నాడు కేవలం రాజకీయ కారణాలతోనే పిట్ హెడ్‌పై కాకుండా సుదూర ప్రాంతంలో యాదాద్రి కేంద్రాన్ని నిర్మించారని వెల్లడించారు. ఈ అనాలోచిత నిర్ణయంతో సుదూర ప్రాంతాల నుంచి బొగ్గును ప్లాంట్‌కు తరలించాల్సి వస్తోందని తెలిపారు. ఇలా బొగ్గు సరఫరా చేయడం వల్ల రాష్ట్రంపై ఏకంగా రూ.40 వేల కోట్ల మేర భారీ అదనపు రవాణా భారం పడుతోందని అధికారులు గణాంకాలతో ప్రభుత్వానికి నివేదించారు.
గత సర్కారు వేలంలో పాల్గొననందుకే..
సింగరేణి సంస్థ నుంచి జీ-9 బొగ్గును ఏ రూపంలోనైనా సేకరించే అవకాశాలు ఉన్నాయా? అనే అంశంపై ప్రభుత్వం ఆరా తీయగా, గత పాలకుల అలసత్వమే ఈ పరిస్థితికి కారణమని అధికారులు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం గతంలో నిర్వహించిన వాణిజ్య బొగ్గు బ్లాకుల వేలంలో నాటి రాష్ట్ర ప్రభుత్వం పాల్గొనకపోవడంతోనే సింగరేణి కొత్త గనులను దక్కించుకోలేకపోయిందని చెప్పారు. ఆ సమయంలో వేలంలో పాల్గొనకపోవడం వల్లే ఇప్పుడు యాదాద్రికి అవసరమైన జీ-9 బొగ్గును సింగరేణి సరఫరా చేయలేని నిస్సహాయ స్థితికి చేరిందని అధికారులు స్పష్టం చేశారు.
నాటి ప్రభుత్వం చేసిన ఆ తప్పిదానికితోడు, కొత్త బ్లాకులు లేకపోవడంతో సింగరేణిలో ఇప్పటికే ఏకంగా14 బొగ్గు బ్లాకులు పూర్తిగా మూతపడ్డాయని అధికారులు ఉన్నత స్థాయి సమావేశంలో వెల్లడించారు. సొంత రాష్ట్రంలోనే బొగ్గు గనులు ఉన్నప్పటికీ, విధానపరమైన తప్పిదాల వల్ల యాదాద్రి ప్రాజెక్టుకు అవసరమైన గ్రేడ్ బొగ్గు అందకుండా పోయిందని వివరించారు.
సమీక్షా సమావేశంలో ఎంపీ వేంనరేందర్‌రెడ్డి, సీఎం సలహాదారు కె.రామకృష్ణారావు, సీఎస్ సంజయ్ జాజు, ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ నవీన్ మిట్టల్, సింగరేణి సీఎండీ జ్యోతి బుద్ధ ప్రకాష్, ట్రాన్స్‌కో, టీజీఆర్‌పీడీసీఎల్, జెన్‌కో, టీజీఎస్‌పీడీసీఎల్, టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీలు పాల్గొన్నారు.