
Balakrishna’s Bhagavanth Kesari Goes Global as Iran Mocks Trump: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో ఇరాన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. ఇరాన్ జింబాబ్వే రాయబార కార్యాలయం సోషల్ మీడియా వేదికగా ఓ సినిమా క్లిప్‌ను షేర్ చేసింది. ఆ క్లిప్ టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ చిత్రానికి చెందినది కావడం విశేషం.
‘ఇరాన్ రక్షణ లేని దేశం కాదు’ అంటూ పోస్ట్
ఇరాన్ జింబాబ్వే ఎంబసీ తన X ఖాతాలో ఈ వీడియోను షేర్ చేస్తూ.. ట్రంప్ ఇరాన్‌ను పూర్తిగా నాశనం చేస్తామని మాట్లాడుతున్నారని, అయితే ఇరాన్ రక్షణ లేని దేశం కాదని వ్యంగ్యంగా పేర్కొంది. అలాగే ట్రంప్ ఇటీవల హాలీవుడ్ సినిమాల కంటే బాలీవుడ్ సినిమాలు చూస్తున్నారని సరదాగా వ్యాఖ్యానించింది. అయితే ఇరాన్ ఎంబసీ ‘బాలీవుడ్’ అని పేర్కొన్నప్పటికీ.. అది వాస్తవానికి తెలుగు సినిమా. నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన భగవంత్ కేసరి 2023లో విడుదలైన తెలుగు యాక్షన్ చిత్రం.
ఏ సినిమా క్లిప్‌ను షేర్ చేశారు?
ఎంబసీ షేర్ చేసినది సుమారు 58 సెకన్ల క్లిప్. ఇందులో బాలకృష్ణ పాత్రకు, ఆయుధాలతో ఉన్న మరో వర్గానికి మధ్య తీవ్ర యాక్షన్ సన్నివేశం కనిపిస్తుంది. ఈ క్లిప్‌ను ట్రంప్ ఇరాన్‌పై చేసిన వ్యాఖ్యలకు వ్యంగ్యాత్మక సమాధానంగా ఉపయోగించినట్లు తెలుస్తోంది. దీంతో బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమా సన్నివేశం ఒక్కసారిగా అంతర్జాతీయ రాజకీయ చర్చలోకి వచ్చింది.
ఇరాన్‌పై ట్రంప్ ఏం అన్నారు?
2026 సెప్టెంబర్ 22న ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో ప్రసంగించిన ట్రంప్.. ఇరాన్‌తో ఒప్పందం కుదిరే అవకాశాన్ని ప్రస్తావించడంతో పాటు, ఒప్పందం జరగకపోతే ఇరాన్‌ను పూర్తిగా నాశనం చేసే చర్యను పరిశీలించవచ్చని వ్యాఖ్యానించారు. ట్రంప్ ప్రసంగంలో ఇరాన్ అణ్వస్త్ర సామర్థ్యాన్ని అడ్డుకోవడం అమెరికా విధానంలో ముఖ్య అంశమని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో వచ్చాయి.
వైరల్‌గా మారిన బాలయ్య సినిమా సీన్
ట్రంప్ వ్యాఖ్యల తర్వాత ఇరాన్ రాయబార కార్యాలయం బాలకృష్ణ సినిమా క్లిప్‌ను షేర్ చేయడంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు వచ్చింది. ముఖ్యంగా బాలీవుడ్ అని చెప్పి టాలీవుడ్ సినిమాను ఉపయోగించడం కూడా నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఇలా అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న తీవ్ర దౌత్యపరమైన మాటల యుద్ధంలో ఓ తెలుగు సినిమా సన్నివేశం అనూహ్యంగా అంతర్జాతీయ స్థాయిలో ప్రస్తావనకు వచ్చింది.
Trump talks about annihilating Iran.
But he knows Iran is not defenseless.
Since we informed they have recently been watching Bollywood instead of Hollywood. pic.twitter.com/v6Le8zkH5X
— Iran Embassy in Zimbabwe (@IRANinZIMBABWE) September 23, 2026