
Madras Regiment Arms Theft Case: హైదరాబాద్ నగరంలోని బొల్లారం మద్రాసు రెజిమెంట్ నుంచి ఆయుధాలను చోరీ చేసిన కేసులో మరో బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో అరెస్టైన మాజీ హవాల్దార్ మల్లేష్‌కు గతంలో నేర చరిత్ర ఉందని మల్కాజ్ గిరి పోలీసు కమిషనరేట్ పోలీసులు కస్టడీ విచారణలో నిర్ధారించుకున్నారు. మల్లేష్ పై 2005 నుంచి 2007 వరకు అచ్చంపేట, అమ్రాబాద్ పోలీస్ స్టేషన్‌లలో హౌజ్ బ్రేకింగ్ (ఇళ్లలో చోరీలు) కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఆ రెండు కేసులు కోర్టులో వీగిపోయి మల్లేష్ నిర్దోషిగా బయటపడినట్లు పోలీసులు గుర్తించారు.
మిలటరీ ఉద్యోగంలో ఎంపికైన సమయంలో మల్లేష్ ఈ విషయాలను మిలటరీ అధికారులకు చెప్పాడా..? ఉద్యోగంలో ఎంపిక చేసిన మిలటరీ ఉన్నతాధికారులు మల్లేష్ బ్యాక్ గ్రౌండ్ ను సరైన పద్ధతిలో తనిఖీ చేశారా.? అనే విషయాలపై పోలీసులు ఇప్పుడు దృష్టి పెట్టారు. ఎంపిక సమయంలో మల్లేష్ మిలటరీ అధికారులకు సమర్పించిన ప్రతాలు పోలీసులు మరోసారి పరిశీలించేందుకు సిద్ధమవుతున్నారు.
మరోవైపు మల్లేష్ మద్రాసు రెజిమెంట్ యూనిట్ నుంచి ఆయుధాలను చోరీ చేసేందుకు ఎన్ని నెలల నుంచి ప్లాన్ చేశాడు.? ఎలా స్కెచ్ వేసుకున్నాడు? దీని కోసం ఇంకా ఎవరినైనా సంప్రదించాడా? ఇంటర్నెట్ ద్వారా ఏదైనా సమాచారం సేకరించాడా.? అనే విషయాలపై పోలీసులు దృష్టి పెట్టారు. మల్లేష్ మిలటరీ ఆయుధాల చోరీకి ఆదివారాన్ని ఎందుకు ఎంచుకున్నాడనే.. అంశం పై పోలీసులు ప్రత్యేకంగా నజర్ పెట్టారు.
ఈ విషయం పై మల్లేష్ ను ప్రశ్నించగా.. ఆదివారం రోజైతే మల్లేష్ టార్గెట్ చేసుకున్న స్పాట్‌లో ఉన్నతాధికారుల నిఘా తక్కువగా ఉండడం వారి రాకపోకలు అసలు జరుగవని అవగాహన ఉంది. అంతేకాకుండా గార్డ్ డ్యూటీలో ఉండే వారు కూడా కొంత రెస్ట్ మోడ్‌లో ఉంటారని మల్లేష్ కు స్పష్టంగా తెలుసు. అందుకే అతను ఆదివారాన్ని తన చోరీకి అనువైన రోజుగా ఎంచుకున్నట్లుగా పోలీసులకు తెలిపినట్లు సమాచారం.
కస్టడీలో ఉన్న మల్లేష్ ను బొల్లారం పోలీసు అధికారులతో కలిసి మిలటరీ ఇంటెలిజెన్స్ అధికారులు సైతం విచారించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో వినాయక నిమజ్జనం అనంతరం పోలీసు ఉన్నతాధికారులతో కలిసి మిలటరీ ఇంటెలిజెన్స్ అధికారులు మల్లేష్‌ను ప్రశ్నించనున్నట్లు సమాచారం. ఇంకా మల్లేష్ తన మొబైల్ ఫోన్ లో డిలీట్, క్లియర్ చాట్ చేసిన విషయాలపై ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారుల నివేదిక వచ్చిన తర్వాత వాటి పై కూడా పోలీసులు ప్రశ్నించనున్నారని సమాచారం. కస్టడీలోని విచారణ అంశాలు పోలీసులు అధికారికంగా ధ్రువీకరించడం లేదు.