తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూ్స్ తెలిపింది. త్వరలో దసరా, దీపావళి పండగలు వస్తున్న క్రమంలో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తోంది. ఇప్పటినుంచే అడ్వాన్స్ రిజర్వేషన్లను మొదలుపెడుతోంది. పండక్కి ఇంటికెళ్లే ప్రయాణికులతో రైళ్లల్లో ఎక్కువ రద్దీ ఏర్పడనుంది. సొంతూరుకెళ్లేందుకు ఇప్పటినుంచే ప్లాన్ చేసుకుంటున్నారు.
పండక్కి ఇంటికెళ్లేందుకు టికెట్లను ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. దీంతో రైల్వేశాఖ స్పెషల్ రైళ్లను ప్రకటించడంతో పాటు వాటిల్లో రిజర్వేషన్లకు కూడా అవకాశం కల్పిస్తోంది. తాజాగా సికింద్రాబాద్-కాకినాడ మధ్య ప్రత్యేక రైలును దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ రైళ్ల టైమింగ్స్, స్టాపుల వివరాలను కూడా వెల్లడించారు. ఈ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
సికింద్రాబాద్-కాకినాడ టౌన్(07039) ప్రత్యేక రైలు అక్టోబర్ 7వ తేదీ నుంచి నవంబర్ 25వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ప్రతీ బుధవారం సికింద్రాబాద్లో 7.10 గంటలకు బయల్దేరి గురువారం ఉదయం 8 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. ఇక తిరుగు ప్రయాణంలో కాకినాడ-సికింద్రాబాద్(07040) రైలు కాకినాడలో గురువారం 21.00 గంటలకు బయల్దేరి తర్వాతి రోజు ఉదయం 8.50 గంటలకు సికింద్రాబాద్కు చేరుకుంటుంది. ఈ ట్రైన్ అక్టోబర్ 8 నుంచి నవంబర్ 26 వరకు సర్వీసులు అందించనుంది.
ఈ ప్రత్యేక రైలు చర్లపల్లి, నల్లగొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకొట స్టేషన్లలో ఆగనుంది. ఈ రైల్లో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీతో పాటు స్లీపర్, జనరల్ కోచ్లు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్ నుంచి తెలంగాణలోని పలు ప్రాంతాలతో పాటు ఏపీకి వెళ్లే ప్రయాణికులకు ఈ రైలు ఉపయోగపడనుందని చెప్పవచ్చు. పండుగ సీజన్లో రద్దీని తగ్గించేందుకు ఈ రైలును తీసుకొచ్చారు.
ఇక జల్నా-యలహంక మధ్య ప్రత్యేక రైళ్లను మరికొన్ని రోజుల పాటు పొడిగించారు. జల్నా-యలహంక(07601) రైలు అక్టోబర్ 4 నుంచి నవంబర్ 25 వరకు పొడిగించారు. ఇది ప్రతీ ఆదివారం 19.20 గంటలకు జల్నాలో బయల్దేరి.. తర్వాతి రోజు 21.30 గంటలకు యలహంక చేరుకుంటుది. ఇక తిరుగు ప్రయాణంలో 07602 నెంబర్ రైలు యలహంకలో 23.30 గంటలకు బయల్దేరి.. తర్వాతి రోజు 01.00 గంటలకు జల్నా చేరుకుంటుంది.




