Reading Time: < 1 minute

59 రన్స్ చేస్తే కోహ్లీ 15K.. 105 చేస్తే రోహిత్ 12K: విండీస్ సిరీస్‌లో కింగ్ – హిట్‌మ్యాన్ రచ్చ!

Caption of Image.

RO-KO: స్వదేశంలో వెస్టిండీస్‌తో ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభం కానున్న 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం భారత క్రీడాభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. టీమిండియా దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డే జట్టులోకి రీఎంట్రీ ఇస్తుండటంతో ఈ సిరీస్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా, ఈ సిరీస్ వేదికగా రో– కో (RO-KO) జోడీ చారిత్రాత్మక రికార్డులు సాధించే అవకాశానికి అత్యంత చేరువలో ఉంది.   

15,000 పరుగుల దిశగా విరాట్ కోహ్లీ:

వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన బ్యాటర్లలో ఒకరైన విరాట్ కోహ్లీ మరో సరికొత్త రికార్డు ముందు నిలిచాడు. కోహ్లీ మరో 59 పరుగులు సాధిస్తే వన్డే ఫార్మాట్‌లో 15,000 పరుగుల మైలురాయిని పూర్తి చేసుకుంటాడు. ఈ ఘనత సాధిస్తే ప్రపంచ వన్డే క్రికెట్ చరిత్రలోనే 15 వేల పరుగులు పూర్తి చేసిన అత్యంత వేగవంతమైన బ్యాటర్‌గా కింగ్ చరిత్రలోకెక్కుతాడు.

12,000 పరుగులపై కన్నేసిన రోహిత్:

మరోవైపు టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఇంకో రికార్డుని చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. రోహిత్ ఈ సిరీస్‌లో మరో 105 పరుగులు చేయగలిగితే వన్డే ఫార్మాట్‌లో 12,000 పరుగుల మైల్ స్టోన్‌ను అందుకుంటాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న హిట్ మ్యాన్ మొదటి మ్యాచ్‌లోనే ఈ మైలురాయి దాటాలని అతడి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 

ఈ రికార్డులు ఈజీగా సాధిస్తారు: ఫ్యాన్స్ 

గతంలో ఈ ఇద్దరు దిగ్గజాలు చూపించిన విధ్వంసకర ఫామ్‌ను బట్టి చూస్తే, ఈ నెల 27న తిరువనంతపురంలో జరిగే తొలి వన్డేలోనే ఈ రికార్డులను ఎంతో సులువుగా సాధిస్తారని క్రికెట్ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ వన్డే సిరీస్‌లో రో-కో జోడీ ఈ చారిత్రక ఘనతలు సాధించి మైదానాన్ని హోరెత్తిస్తుందో లేదో మరీ చూడాలి. 

©️ VIL Media Pvt Ltd.