
Samastipur Harassment Case: బీహార్‌లోని జముయిలో ఇటీవల ఓ మైనర్ బాలికను వేధించిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువకముందే బిహార్‌లో మరో బాలిక వేధింపుల ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సమస్తిపూర్ జిల్లాలోని కర్పూరిగ్రామ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొందరు యువకులు ఓ మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించారు. ఈ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లడంతో అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.
పోలీసుల ప్రకారం.. జగత్‌సింగ్‌పూర్ గ్రామ పరిధిలోని బండ్ బైపాస్ రోడ్డుపై ఓ మైనర్ బాలుడు, బాలిక బైక్ పై వచ్చి మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో కొందరు యువకులు వారిని చుట్టుముట్టినట్లు సమాచారం. ముందుగా బాలుడిపై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో అతడు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అనంతరం బాలికను యువకులు వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి.
బాలిక అభ్యంతరం వ్యక్తం చేసినట్లు వీడియోలో..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో బాలిక చుట్టూ కొందరు యువకులు ఉన్నట్లు కనిపిస్తోంది. వారు బాలికను ఆమె చిరునామా గురించి పలుమార్లు ప్రశ్నించినట్లు సమాచారం. తన సోదరుడికి ఫోన్ చేస్తానని బాలిక చెప్పిన సమయంలో కూడా కొందరు యువకులు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీడియోలో ఒక వ్యక్తి బాలికతో అనుచితంగా ప్రవర్తించినట్లు, ఆమె దానిని వ్యతిరేకిస్తూ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు కనిపిస్తోంది. అయితే వీడియో పూర్తి నేపథ్యం, అందులో కనిపిస్తున్న వ్యక్తుల పాత్రలు, ఘటనకు సంబంధించిన ఇతర వివరాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వీడియో వైరల్ కావడంతో పోలీసుల చర్యలు
ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో సమస్తిపూర్ పోలీసుల దృష్టికి వెళ్లింది. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. వీడియో ఆధారంగా అనుమానితులను గుర్తించే ప్రయత్నం చేసిన పోలీసులు ఇప్పటివరకు నలుగురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. అరెస్ట్ అయిన వారిని రాహుల్ కుమార్ (19), అవధేష్ పాస్వాన్ (46), వికాస్ శర్మ (32), రాంబాబు సహ్ని (38)గా గుర్తించినట్లు సమాచారం. వారిని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
బాధ్యులపై చర్యలు తీసుకుంటాం: ఎస్పీ
వైరల్ వీడియోపై సమస్తిపూర్ పోలీసులు సుమోటోగా స్పందించి స్థానిక పోలీస్ స్టేషన్‌ను ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించినట్లు జిల్లా ఎస్పీ అరవింద్ ప్రతాప్ సింగ్ తెలిపారు. ఘటనలో ఎవరి పాత్ర నిర్ధారణ అయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.
జముయి ఘటన తర్వాత మరో ఘటన
సమస్తిపూర్ ఘటన వెలుగులోకి వచ్చిన సమయంలోనే బిహార్‌లోని జముయిలో మైనర్ బాలికలపై వేధింపులకు సంబంధించిన మరో ఘటనపై వివాదం కొనసాగుతోంది. ఆ ఘటనలో కూడా కొందరు వ్యక్తులు అరెస్టైనట్లు సమాచారం. వరుసగా ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం బిహార్‌లో మహిళలు, బాలికల భద్రతపై మరోసారి చర్చకు దారితీసింది. మానవ మృగాలు జనావాసాల్లో తిరుగుతున్నాయని ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. మహిళలను గౌరవించాలని, వేధింపులకు పాల్పడే వారు తమ బుద్దిని మార్చుకోండ్రా బాబు అంటూ కామెంట్ చేస్తున్నారు.