Reading Time: < 1 minute

గణేశ్ నిమజ్జన వేడుకల్లో పాల్గొన్న మంత్రి వివేక్ వెంకటస్వామి

Caption of Image.

మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్‌లో వినాయక చవితి ముగింపు వేడుకలు అత్యంత వైభవంగా, కోలాహలంగా సాగాయి.  హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కార్మిక వాడలన్నీ గణపతి బప్పా మోరియా నినాదాలతో మార్మోగాయి. భక్తిశ్రద్ధలతో సాగిన ఈ శోభయాత్రలో ప్రజలు పెద్దఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర మంత్రి వివేక్ మాట్లాడుతూ… ప్రజలందరూ ఐకమత్యంగా పండుగను జరుపుకోవడం సంతోషకరమన్నారు. అయితే, గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు పోలీసు నిబంధనలు ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలని పిలుపునిచ్చారు.

ఇదే వేదికగా కార్మికులకు మంత్రి కీలక హామీలిచ్చారు. జీవో 76 స్టే ఎత్తివేతపై సబ్ కమిటీలో సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాగానే, క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో సింగరేణి స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న అర్హులైన పేదలందరికీ త్వరలోనే పట్టాలు అందిస్తామని స్పష్టం చేశారు.

మరోవైపు, ఎల్ నినో ప్రభావంతో వర్షాలు సరిగా కురవకపోవడంతో నీటి ఎద్దడి సమస్య తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసిన మంత్రి… ప్రజలంతా నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడాలని కోరారు. ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం, రామకృష్ణాపూర్‌లో ఆర్కే ఓపెన్ కాస్ట్ ఫేజ్-2 కొత్త గనిని త్వరలోనే ప్రారంభిస్తామని, దీని ద్వారా స్థానిక యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని భరోసానిచ్చారు.

©️ VIL Media Pvt Ltd.