ఒక గ్లాసు బాస్మతి లేదా సాధారణ బియ్యాన్ని శుభ్రంగా కడిగి, ఒకటిన్నర నుండి రెండు గ్లాసుల నీరు, కొద్దిగా నూనె, ఉప్పు కలిపి ప్రెషర్ కుక్కర్లో మీడియం మంటపై రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. అన్నం పొడిపొడిగా వండిన తర్వాత ప్రెషర్ పోయాక పక్కన ఉంచాలి.
తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో పావు కప్పు పెరుగు తీసుకుని, దానికి రుచికి సరిపడా ఉప్పు, ఒక టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ మిరియాల పొడి, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి బాగా కలపాలి.
తర్వాత స్టవ్ ఆన్ చేయాలి. కడాయి పెట్టి అందులో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు, రెండు మూడు టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులు వేసి దోరగా వేయించాలి. ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, రెండు చీల్చిన పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి ఉల్లిపాయలు మంచి బంగారు రంగు వచ్చేవరకు మీడియం మంటపై వేయించాలి.
తర్వాత ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు మసాలా పేస్ట్‌ను వేసి, నూనె పైకి తేలే వరకు మీడియం మంటపై వేయించాలి. సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా వేసి, ఆ తర్వాత ఉడికించిన అన్నాన్ని వేసి బాగా టాస్ చేయాలి. రుచి చూసి ఉప్పు సరిచేసుకోవాలి. ఒక బద్ద నిమ్మరసం పిండి, బాగా కలిపి స్టవ్ ఆపి, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. ఈ ఉల్లిపాయ మసాలా రైస్ ఎక్కువ సమయం తీసుకోకుండా, త్వరగా సిద్ధం అవుతుంది.
అంతే టేస్టీ టేస్టీ ఉల్లిపాయ మసాలా రైస్ రిసిపీ రెడీ. చిన్న పిల్లలే కాదండోయ్ పెద్దవారు కూడా దీనిని చాలా ఇష్టంగా తింటారు. అయితే మీరు కూడా ఈ ఫుడ్ టేస్ట్ చేయాలి అనుకుంటున్నారా? అయితే తప్పుకుండా ఇప్పుడే ప్రిపేర్ చేయండి మరి.




