
ఐక్యరాజ్యసమితి వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. సెప్టెంబర్ 22న ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై తీవ్ర హెచ్చరికలు జారీ చేయగా.. మరుసటి రోజు అదే వేదికపై ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ధీటుగా స్పందించారు. అణు కార్యక్రమాన్ని వదులుకోవాలన్న ఒత్తిడికి తాము తలొగ్గబోమని స్పష్టం చేస్తూనే.. దౌత్యానికి మాత్రం తలుపులు తెరిచే ఉంచామన్నారు.
ట్రంప్ తన ప్రసంగంలో ఇరాన్ అణ్వస్త్రాలను అభివృద్ధి చేయకుండా అడ్డుకోవాల్సిన అవసరాన్ని ప్రస్తావిస్తూ, ఒప్పందం కుదరకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిని పెంచేందుకు ప్రపంచ దేశాలు సహకరించాలని పిలుపునిచ్చారు. దీనికి స్పందించిన పెజెష్కియాన్.. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ ప్రజలే బాధితులుగా మిగిలారని ఆరోపించారు. తమను ఉగ్రవాదులుగా చిత్రీకరించడం సరికాదని, తామే ఉగ్రవాదానికి బాధితులమని అన్నారు. తన ప్రసంగంలో మినాబ్‌లోని బాలికల పాఠశాలపై జరిగిన దాడిలో మృతి చెందిన చిన్నారుల ఫొటోలను, మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ చిత్రాన్ని ప్రదర్శించారు.
అదే సమయంలో ఇరాన్ అధ్యక్షుడు శాంతి, చర్చలు, దౌత్యానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అయితే బలప్రయోగం, బెదిరింపుల భాషలో చర్చలు జరపలేమని స్పష్టం చేశారు. ఆంక్షలు లేదా సైనిక చర్యల ఒత్తిడికి తమ అణు కార్యక్రమాన్ని వదులుకునే ప్రసక్తే లేదని ఆయన పేర్కొన్నారు.
బాలయ్య వీడియోతో ట్రంప్‌నకు ఇరాన్ కౌంటర్!
ఇదిలా ఉండగా, అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలో తెలుగు సినిమా ఊహించని విధంగా తెరపైకి వచ్చింది. జింబాబ్వేలోని ఇరాన్ రాయబార కార్యాలయం సోషల్ మీడియా ‘ఎక్స్’లో నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ సినిమాలోని యాక్షన్ సన్నివేశాన్ని పోస్టు చేసింది. ఇరాన్‌ను నాశనం చేస్తామని ట్రంప్ మాట్లాడుతున్నప్పటికీ.. ఇరాన్ తనను తాను రక్షించుకోలేని దేశం కాదనే భావనను ఆ వీడియో ద్వారా వ్యక్తం చేసింది. అయితే రాయబార కార్యాలయం పోస్టులో ఆ సినిమాను ‘బాలీవుడ్’గా పేర్కొన్నప్పటికీ, ‘భగవంత్ కేసరి’ తెలుగు సినిమా కావడం గమనార్హం. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ ఇచ్చిన ఈ సినీ తరహా స్పందన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
Trump talks about annihilating Iran.
But he knows Iran is not defenseless.
Since we informed they have recently been watching Bollywood instead of Hollywood. https://t.co/v6Le8zkH5X
— Iran Embassy in Zimbabwe (@IRANinZIMBABWE) September 23, 2026
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..