
న్యూఢిల్లీ: లడఖ్ ప్రాంత భూములు, ఉపాధి అవకాశాలు, సంస్కృతిని పరిరక్షించేందుకు ఆరో షెడ్యూల్‌తో కూడిన రాజ్యాంగ రక్షణలు కల్పించాలన్న డిమాండ్‌కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. స్థానిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లడఖ్‌లో పూర్తిస్థాయి ప్రజాస్వామ్య వ్యవస్థలను పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. గతేడాది సెప్టెంబర్ 24న లడఖ్‌కు రాష్ట్ర హోదా, రాజ్యాంగ రక్షణలు కోరుతూ లేహ్‌లో జరిగిన ఆందోళనల్లో పోలీసుల కాల్పుల్లో నలుగురు యువకులు మృతి చెందిన విషయాన్ని అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఖర్గే గుర్తుచేసుకున్నారు.
ఆనాటి విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన యువకుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ ఘటనపై జరుగుతున్న న్యాయ విచారణ పక్షపాతం లేకుండా జరిపి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. లడఖ్ ప్రజలు తమ హక్కుల కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారని, వారి భవిష్యత్తును వారే నిర్ణయించుకునే అవకాశం కల్పించాలని ఖర్గే పేర్కొన్నారు.